‘మా ఊరి పొలిమేర’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చేతబడి (బ్లాక్ మ్యాజిక్) నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఆడియన్స్ ఎంతగానో ఆదరించారు. దీంతో ఈ మూవీ సీక్వెల్ అయిన ‘పొలిమేర 2’ను మేకర్స్ థియేటర్లో రిలీజ్ చేశారు. అది కూడా అంతే స్థాయిలో విజయం సాధించి ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో పొలిమేర డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ బిగ్ ప్లాన్ వేశారు. మూడో భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
జాతీయ స్థాయిలో..
హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాల్లో సత్యం రాజేష్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), బాలదిత్య (Baladitya), గెటప్ శీను (Getup Srinu) ప్రధాన పాత్రలు పోషించారు. ‘పొలిమేర 2’ గతేడాది థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. తొలి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ఘన విజయం అందుకుంది. ఈ క్రమంలోనే ‘పొలిమేర 3’ (Polimera 3) రూపొందించబోతున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటన చేసింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ప్రకారం తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ‘పొలిమేర 3’ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి ఈ ‘పొలిమేర 3’ తో నిర్మాతగా మారుతున్నారు. ‘పొలిమేర’ సినిమాకి నిర్మాతగా వున్న భోగేంద్ర గుప్త ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలిసింది.
త్వరలోనే షూటింగ్
‘పొలిమేర 3’ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ డా. అనీల్ విశ్వనాథ్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నట్లు సమాచారం. వేగంగా ఆ పనులు కూడా ఫినిష్ చేసుకొని త్వరలోనే షూటింగ్ మెుదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పార్ట్ 3’ ఇంకా అదిరిపోతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. గత చిత్రాలకు మించిన ట్విస్టులు, ఇంట్రస్టింగ్ స్టోరీతో ‘పొలిమేర 3’ రానున్నట్లు పేర్కొంటున్నాయి.
ఆ పజిల్స్‌కు ‘పొలిమేర 3’లో ఆన్సర్లు!
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ‘పొలిమేర 3’ కోసం ఎన్నో చిక్కుముడులను పార్ట్ 2లోనే వదిలి వెళ్లారు. ‘పొలిమేర 2’ క్లైమాక్స్‌ను పార్ట్-3కి ముడి పెడుతూ కొన్ని పజిల్స్ ఇచ్చారు. జాస్తిపల్లిలోని గుడి నేలమాళిగలో ఉన్న సంపదను క్షుద్రపూజ చేసి కొమురయ్య (సత్యం రాజేష్) కనుగొనడం క్లైమాక్స్‌లో చూపించారు. కట్ చేస్తే భార్యను కలవడానికి వెళ్లిన కొమురయ్యకు లక్ష్మీ ( కామాక్షి భాస్కర్ల) విషం పెడుతుంది. అతడు స్పృహా కోల్పోగానే అనూహ్యంగా నటుడు పృథ్వీ వచ్చి లక్ష్మీ నుదుటిపై కాల్చి చంపేస్తాడు. పృథ్వీ అలా ఎందుకు చేశాడు? నేలమాళిగలోని సంపదను కొమురయ్య ఏం చేశాడు? కొమురయ్య తమ్ముడు జంగయ్య (బాలాదిత్య) అసలు దేనిని వెతుక్కుంటూ వెళ్లాడు? అన్నది మూడో భాగంలో చూపించనున్నారు.
మరో ‘కాంతారా’ కానుందా?
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ (Kantara) చిత్రం దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ‘కాంతార’ కూడా పొలిమేర తరహాలోనే ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈ రెండు సినిమాల కథలు డిఫరెంట్ అయినప్పటికీ నేపథ్యం మాత్రం ఒకటే. కంటికి కనిపించని శక్తులతో ఈ రెండు చిత్రాలు రూపొందాయి. కాంతార దేవ శక్తి బ్యాక్‌డ్రాప్‌లో వస్తే పొలిమేర మాత్రం బ్లాక్ మ్యాజిక్‌తో తెరకెక్కింది. ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చిన చిత్రాలకు నార్త్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ‘పొలిమేర 3’ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొలిమేర చిత్రం వారికి కొత్త అనుభూతిని పంచుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి ‘పొలిమేర 3’ పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.