అంజన్ రామచంద్ర, శ్రావణి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లవ్ రెడ్డి’ (Love Reddy). గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్ మీట్ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
దాడి ఎందుకు జరిగిందంటే?
లవ్ రెడ్డి చిత్రానికి హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ బాస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్’ పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నిజాంపేటలోని జీపీఆర్ మాల్‌కు ‘లవ్ రెడ్డి’ బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్ సీన్ రన్ అవుతోంది. హీరోయిన్ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.
‘లవ్ రెడ్డి’ ఎలా ఉందంటే
పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా – కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి.
కథ ఏంటంటే
నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.