‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ప్రభాస్ క్రేజ్ మరో స్థాయికి వెళ్లింది. దీంతో అతడి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రభాస్ ఇప్పటికే డైరెక్టర్ మారుతీతో ‘రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ సీక్వెల్లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ తర్వాతి చిత్రం కోసం స్టార్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్యూలో ఉన్నారు. వీరిద్దరిలో ముందుగా సందీప్ రెడ్డి సినిమాను ప్రభాస్ సెట్స్‌పైకి తీసుకెళ్తారని అంతా భావించారు. అయితే వీటిని కాదని ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ డైరెక్టర్‌కే ప్రిఫరెన్స్!
‘కల్కి 2898 ఏడీ’ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తారని ఫ్యాన్స్ సహా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా సందీప్ ప్లేస్‌లోకి డైరెక్టర్ హను రాఘవపూడి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ గతంలోనే ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. ఆ సినిమా టైటిల్‌ను ‘ఫౌజి’గా కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్ ‘ఫౌజి’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో అక్టోబర్‌లో షూటింగ్ మెుదలు పెట్టేందుకు డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సన్నాహాలు మెుదలుపెట్టినట్లు సమాచారం.
జవాన్‌గా ప్రభాస్!
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రానున్న ఫౌజి చిత్రం, ఓ పిరియాడికల్ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. 1940 బ్యాక్‌డ్రాప్‌లో బ్రిటిష్ కాలం నాటి సినిమాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించే అవకాశముంది. ఇక ఫౌజీ అంటే జవాన్ అని అర్థం. కాబట్టి ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అతి భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి అధికారిక అప్డేట్స్ త్వరలో రావొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
‘రాజా సాబ్’ టీమ్ బిగ్ ప్లాన్!
ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో ‘రాజా సాబ్’ (Raja Saab) తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఇందులో ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేయాలని డైరెక్టర్ మారుతీ భావిస్తున్నారట. అయితే అది తెలుగు పాట కాదని సమాచారం. 1980లో హిందీలో వచ్చిన ఓ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో మారుతి చర్చలు కూడా జరుపుతున్నట్లు టాక్. ప్రస్తుతం మేకర్స్ పరిశీలనలో మూడు పాటలు ఉన్నాయట. వాటిలో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ ఎవర్గ్రీన్ ‘ఓ కైకే పాన్ బనారస్ వాలా’ పాటను రీమేక్ చేసే అవకాశముందని సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
‘నా బెస్ట్ ఏంటో చూపిస్తా’
డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ప్రభాస్ ఒక్కరే ఫిక్స్ కాగా ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో సందీప్ ఉన్నారు. అయితే స్పిరిట్ ఎలా ఉండబోతుందోనన్న దానికి సందీప్ తాజాగా ఒక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ‘కొందరు యానిమల్ నా బెస్ట్ వర్క్ అంటున్నారు. నా బెస్ట్ వర్క్ ఏంటో స్పిరిట్‌లో చూస్తారు’ అని సందీప్ రెడ్డి వంగా అన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సందీప్ తీసిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలకంటే ‘స్పిరిట్’ అత్యుత్తమంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇంకో రూ.1000 కోట్లు లోడింగ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
పవర్ఫుల్ పోలీసుగా ప్రభాస్
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’ను విభిన్నంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy), యానిమల్ (Animal) సినిమాల తరహాలో పెద్దింటి కుటుంబాల మధ్య కథను అల్లకుండా మధ్యతరగతి బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే స్పిరిట్‌లో ప్రభాస్ పాత్రకు సంబంధించి గతంలోనే సందీప్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. గతంలో ఎప్పుడూ చూడని ప్రభాస్‌ను ఈ మూవీలో చూడబోతున్నట్లు సందీప్ చెప్పారు. అతడి క్యారెక్టరైజేషన్, లుక్‌తో పాటు మేనరిజమ్స్ కొత్తగా ఉండబోతున్నట్లు సందీప్ వంగా తెలిపాడు. ఇక ‘స్పిరిట్’ స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అక్టోబర్ లేదా నవంబర్ నుంచి స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.