భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాతి నుంచి విదేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా జపాన్, చైనా, రష్యా ఇలా విదేశీ భాషల్లోనూ మన సినిమాలు డబ్ అయ్యి అక్కడ నేరుగా రిలీజవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారతీయ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పుతిన్ ఏమన్నారంటే?
ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ (BRICS) ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పుతిన్ తెలిపారు. 24 గంటలూ ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి అని స్పష్టం చేశారు. ఇండియన్ మూవీస్‌ను రష్యాలో ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వారి చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దీనిపై భారత ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
‘పుష్ప’ దెబ్బకి రష్యన్లు ఫిదా!
ఇటీవల కాలంలో భారతీయ చిత్రాలను రష్యన్లు ఎంతో ఆదరిస్తున్నారు. పుతిన్ తాజా వ్యాఖ్యలతో ఆ దేశంలో భారతీయ సినిమాల మార్కెట్ అమాంతం పెరగనుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రాన్ని 2021 డిసెంబర్ 8న రష్యాలో నేరుగా రిలీజ్ చేశారు. అక్కడి ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. 774 స్కీన్లలో 25 రోజుల పాటు పుష్ప విజయవంతంగా ఆడింది. తద్వారా 10 మిలియన్ రూబెల్స్‌ను కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 13 కోట్లకు సమానం. అంతేకాదు రష్యాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగానూ ‘పుష్ప’ రికార్డు సాధించింది.
‘పుష్ప 2’కి కలిసి రానుందా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లేటెస్ట్ కామెంట్స్ ‘పుష్ప 2’ టీమ్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రష్యాలో ‘పుష్ప’కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సినిమాల ప్రమోషన్స్‌కు తాము సహకరిస్తారమని పుతిన్ సైతం తాజాగా స్ఫష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ‘పుష్ప 2’ని రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఓవర్సీస్ రిలీజ్లో భాగంగా రష్యన్ భాషలోనూ ‘పుష్ప 2’ని డబ్ చేసి విడుదల చేస్తే అది మూవీ కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప టీమ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.
హైప్ పెంచేసిన దేవిశ్రీ
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ సినిమాపై హైప్ పెంచేశారు. అటు ‘పుష్ప 2’ నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు.
మృణాల్తో ఐటెం సాంగ్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.