నటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోర్హానా, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్ తదితరులు
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి
సంగీతం: మాధవి సైబ
సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్ హరీశ్
ఎడిటింగ్: పవన్ శేఖర్ పసుపులేటి
నిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ (అమెరికా ఇండియా) ఎంటర్‌టైన్‌మెంట్స్
‘అమ్మోరు’, ‘అరుంధతి’ వంటి పీరియాడిక్ ఫాంటసీ చిత్రాలు టాలీవుడ్‌లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. అయితే ‘అరుంధతి’ తర్వాత ఆ స్థాయి ఫాంటసీ డ్రామా చిత్రాలు ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. ఈ క్రమంలో ఆ జానర్‌లో మంచు లక్ష్మీ నటించిన చిత్రం ‘ఆదిపర్వం’ (Adiparvam Movie Review). సంజీవ్ మేగోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆదిత్య ఓం, ఎస్తర్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? మంచు లక్ష్మీ తన నటనతో మెప్పించిందా? విజయాన్ని తన ఖాతాలో వేసుకుందా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
కడప దగ్గర్లోని ఎర్రగుడిలో (Adiparvam Movie Review) గుప్తనిధులు ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు. ఆ నిధిని దక్కించుకుంటే రాయలసీమలోనే గొప్ప సంపన్నులు అవుతారని అంతా భావిస్తుంటారు. దీంతో ఆ నిధి సొంతం చేసుకునేందుకు కడప ఎమ్మెల్యే నాగమ్మ (మంచు లక్ష్మీ) ప్రయత్నిస్తుంటుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు రాయప్ప అనే గ్రామపెద్ద కూడా నిధి కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ నిధి కోసం రాయప్ప, నాగమ్మ ఎలాంటి అరాచకాలు చేశారు? ఈ క్రమంలో రాయప్ప తన కూతురు బుజ్జమ్మ (శ్రీజిత)ను ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెను ఎందుకు చంపాలనుకుంది? రాయప్ప, నాగమ్మ ఆగడాలను దేవత మారెమ్మ (సుహాసిని) ఏ విధంగా అడ్డుకుంది? నిధి దక్కించుకోవాలన్న నాగమ్మ కోరిక తీరిందా? లేదా? బుజమ్మ, శ్రీను (వెంకట కిరణ్)ల ప్రేమ వ్యవహారం ఏమైంది? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
నాగమ్మ పాత్రకు మంచు లక్ష్మీ (Adiparvam Movie Review) పూర్తిగా న్యాయం చేసింది. పవర్‌ఫుల్ నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో ఆమె అదరగొట్టింది. ఎలాగైన నిధిని దక్కించుకోవాలన్న నెగిటివ్ షేడ్ పాత్రలో తన మార్క్ చూపించింది. ప్రేమజంటగా చేసిన వెంకట్ కిరణ్, శ్రీజిత మంచి నటన కనబరిచారు. దేవత పాత్రలో చంటిగాడు ఫేం సుహాసిని ఆకట్టుకుంది. రాయప్ప పాత్రలో సత్యప్రకాశ్ బాగా చేశాడు. మంచి లక్ష్మీకి దీటుగా నటించారు. ఎస్తర్ హాట్‌హాట్‌గా కనిపించి అలరించింది. శివ కంఠమనేని, సమ్మెట గాంధీ, ఆదిత్య ఓం తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
1974-1990ల సమయంలో యధార్థంగా జరిగిన ఘటనల ఆధారంగా దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సినిమా తెరకెక్కించారు. ఒక నిధిని వశం చేసుకోవడానికి నరబలి, తమ స్వార్థం కోసం కన్న బిడ్డను బలి ఇవ్వానుకోవడం దాని పర్యవసానాలు దర్శకుడు చక్కగా చూపించారు. నిధి కోసం ప్రాకులాడే ఇద్దరు స్వార్థపరులను ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాన్న సీక్వెన్స్ మెప్పిస్తుంది. ఎర్రగుడి గ్రామ దేవత మారెమ్మ తన గుప్త నిధిని ఎలా కాపాడుకుంది? తనని నమ్ముకున్న వారికి ఎలా అండగా నిలిచింది? అని తనదైన శైలిలో దర్శకుడు చూపించారు. ఈ క్రమంలో జరిగే దైవ, దుష్ట శక్తుల మధ్య ఫైట్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. అటు బుజ్జమ్మ, శ్రీనుల లవ్ ట్రాక్ కూడా బాగానే చూపించారు డైరెక్టర్. అయితే రొటిన్ స్టోరీ కావడం, కథలో నాటకీయత మరీ ఎక్కువగా ఉండటం, గ్రాఫిక్స్‌లో నాణ్యత లేకపోవడం మైనస్‌గా మారాయి.
టెక్నికల్‌గా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Adiparvam Movie Review).. హరీష్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను భారీగా ఎలివేట్ చేసింది. ఫస్టాఫ్ విషయంలో ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్ టీమ్ ఇంకాస్త బెటర్ పర్‌ఫార్మెన్స్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- మంచు లక్ష్మీ నటన
- దైవ, దుష్ట శక్తి మధ్య ఫైట్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ
- పూర్ గ్రాఫిక్స్
- సాగదీత సీన్స్
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం