కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ ఘటన కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటి హేమ (Actress Hema) పేరు వినిపించడమే ఇందుకు కారణం. నటి హేమతో పాటు మరికొంత మంది డ్రగ్స్ సేవించినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే హేమ మాత్రం ఈ రేవ్ పార్టీ విషయంలో తనకేం తెలియదని చెప్పుకొచ్చారు. తను డ్రగ్స్ తీసుకోలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
నటి హేమకు షాక్
బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుపై ఏకంగా 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఇందులో నటి హేమ పేరును సైతం చేర్చడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటి హేమ (Actress Hema) పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్‌ను ఆమె సేవించినట్టు ఆధారాలు చూపిస్తూ మెడికల్ రిపోర్ట్స్‌ను సైతం ఛార్జ్ షీట్‌కు జత చేశారు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా ఈ ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన మరో 9 మందిపై కూడా ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా చేర్చడం గమనార్హం. అయితే హేమతో పాటు హాజరైన మరో యాక్టర్‌కు మాత్రం డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సమసిపోయిందనుకుంటున్న హేమ వ్యవహారం మళ్లీ మొదటికి రావడం ఆసక్తికరంగా మారింది.
హేమను అరెస్టు చేస్తారా?
బెంగళూరు పార్టీ కేసుకు గతంలో అరెస్టు అయిన హేమకు జూన్‌లో అక్కడి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దగ్గర డ్రగ్స్ లభించలేదని ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను హేమకు మంజూరు చేశారు. అయితే తాజాగా చార్జ్‌షీట్‌లో దాఖలైన నేపథ్యంలో ఆమె బెయిల్ రద్దయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు తిరిగి హేమను అరెస్టు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
‘నిరూపిస్తే దేనికైనా రెడీ’
బెంగళూరు రేవ్‌పార్టీ ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఓ మీడియా సంస్థకు తెలియజేశారు. తన నుంచి ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ బెంగళూరు పోలీసులు తీసుకోలేదని ఆమె తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. మరి బెంగళూరు రేవ్ పార్టీ కేసు మున్ముందు ఎలాంటి ములుపులు తిరుగుతోందనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?