ప్రముఖ కమెడియన్ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో స్టార్ కమెడియన్‌గా సత్య స్థిరపడిపోతాడంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్ కమెడియన్స్‌లో సత్య మరో బ్రహ్మానందంగా మారతారంటూ నెట్టింట విస్తృతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు సత్య పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభిస్తోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో సత్య దూకుడు చూస్తుంటే మిగతా కమెడియన్లు సైడ్ అవ్వాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.
సత్య వన్ మ్యాన్ షో!
శుక్రవారం రిలీజైన ‘మత్తు వదలరా 2’ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కమెడియన్ సత్యను ఆకాశానికెత్తుతున్నారు. ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులున్నా, హీరో శ్రీ సింహా అయినా అందరూ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు. మత్తువదలరాతో పోలిస్తే స్క్రిప్టు వీక్ అయినా సినిమాలో వేరే ఆకర్షణలు అంతగా పేలకపోయినా సత్య కామెడీ మాత్రం భలే వర్కవుట్ అయింది. తొలి సీన్ నుంచి చివరి వరకు ప్రతి సీన్లోనూ సత్య నవ్వించాడు. ముఖ్యంగా సినిమాలోని ‘16 ఏళ్ల వయసు’ పాటలో సత్య డ్యాన్స్‌కు భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో చాలా మైనస్‌లు ఉన్నప్పటికీ సత్య తన కామెడీతో వాటన్నింటిన సైడ్ చేసేశాడని వీక్షకులు అంటున్నారు. సత్య ఇలాంటి పర్ఫార్మెన్స్ తన తర్వాతి చిత్రాల్లోనూ చేస్తే స్టార్ కామెడియన్‌గా స్థిర పడటం ఖాయమని అంటున్నారు.
15 ఏళ్ల కృషి..
కమెడియన్‌గా దాదాపు దశాబ్దంన్నర కిందట్నుంచి సత్య ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లే పట్టింది. సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్‌తో చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ సత్య చాలా ఏళ్ల పాటు అతను చిన్న చిన్న పాత్రలతోనే నెట్టుకొచ్చాడు. ఐతే గత కొన్నేళ్ల నుంచి నెమ్మదిగా అతను ఎదుగుతున్నాడు. మంచి క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అదిరిపోయే కామెడీతో సినిమాకు ఆకర్షణగా మారుతున్నాడు. ‘మత్తు వదలరా’, ‘రంగబలి’, ‘బెదురులంక 2012’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ లాంటి సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. హీరోగా చేసిన ‘వివాహ భోజనంబు’లో నవ్వించడంతో పాటు కన్నీళ్లు సైతం పెట్టించాడు. గతంతో పోలిస్తే చాలా బిజీ అయినప్పటికీ తన టాలెంటుని పూర్తిగా వాడుకునే సినిమా రాలేదు. ఇప్పుడు ‘మత్తువదలరా-2’ సత్యకు ఆ లోటును తీర్చిందనే చెప్పాలి.
సత్యపై డైరెక్టర్ల ఫోకస్!
ప్రతీ సినిమాకు గ్రాఫ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్న సత్యపై టాలీవుడ్ డైరెక్టర్ల దృష్టి పడినట్లు తెలుస్తోంది. పలువురు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో అతడి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సత్యతో సెపరేట్ కామెడీ ట్రాక్ పెట్టించే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలోనూ సత్యకు ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. ఇందులో సత్య కామెడీ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు.
ఆ కమెడియన్లకు గట్టి పోటీ!
ప్రస్తుతం టాలీవుడ్లో చాలా మంది కమెడియన్లు ఉన్నారు. సీనియర్ హాస్య నటుడు అలీ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, గెటప్ శ్రీను, సప్తగిరి, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ సైతం హీరోగా మానేసి కమెడియన్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరందరికీ కమెడియన్ సత్య నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సత్య గ్రాఫ్ దృష్ట్యా దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అతడు అవుతాడని అంటున్నారు. కాబట్టి టాలీవుడ్‌లోని ఇతర హాస్య నటులు సైతం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించకపోతే సినిమా అవకాశాలు సన్నగిల్లే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?