నటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు
దర్శకుడు: అభిషేక్ నామా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాత: అభిషేక్ నామా
విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023
నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా అభిషేక్ నామా రూపొందించిన చిత్రం ‘డెవిల్’ (Devil). సంయుక్త కథానాయికగా చేసింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో తొలిసారి గూఢచారిగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
ఈ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలోనే బోస్ ఇండియాలో అడుగు పెడుతున్నట్లు బ్రిటీష్ ఏజెన్సీలు తెలుసుకుంటాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) రంగంలోకి దిగుతాడు. అసలు ఈ కేసుకు, బోస్‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఆ హత్య ఎందుకు జరిగింది? ఏజెంట్ డెవిల్ గతం ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
కళ్యాణ్ రామ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రిటిష్ ఏజెంట్‌గా తన లుక్స్‌లో, యాక్షన్‌లో ఫ్రెష్ నెస్ చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఫైటింగ్ సీక్వెన్స్‌ల్లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. అటు మాళవిక నాయర్ అప్పియరెన్స్, పాత్ర తీరు బాగుంది. సంయుక్తా మీనన్ అందంగా కనిపించడంతో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. బ్రిటీష్ ఆఫీసర్లుగా కనిపించిన వారు చక్కగా నటించారు. వశిష్ట, షఫీ, మహేష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అభిరామి, ఏస్తర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అభిషేక్ నామా ఎంచుకున్న 1945 నాటి కథ, కథనం కొత్తగా అనిపిస్తుంది. కథ రాసుకున్న తీరు, దీనికి క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను యాడ్ చేసి ఒక్కో పాయింట్‌ను రివీల్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఫస్ట్‌హాఫ్‌ను చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తున్నట్లు అనిపించినా సస్పెన్స్‌గా మాత్రం అనిపించదు. ద్వితీయార్థాన్ని కాస్త ఎమోషనల్‌గా నడుపుదామని డైరెక్టర్ యత్నించినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించదు. కొన్ని సీన్లు లాజిక్స్‌కు దూరంగా ఉంటాయి. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మెప్పిస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్‌ను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కొన్ని చోట్ల కథకు స్పీడు బ్రేకుల్లా అడ్డుపడినట్లు అనిపిస్తాయి. అయితే హర్షవర్ధన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అద్భుతంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. సినిమా సెటప్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కళ్యాణ్‌రామ్ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- ఆర్ట్ టీమ్ పనితనం
మైనస్ పాయింట్స్
- పాటలు
- స్క్రీన్ ప్లే
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్