• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?

    నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు

    రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్

    ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల

    సంగీతం: ఇషాన్ చబ్రా

    నిర్మాత: శరత్ మరార్ 

    ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

    ఎపిసోడ్స్‌: 8

    విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023  

    సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. ’13బి’, ‘ఇష్క్’, ‘మనం’, ’24’ వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘దూత’. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. ’13బి’ తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన ‘దూత’ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. 

    కథ

    సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్‌ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్‌ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది.

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్‌ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్‌. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్‌. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్‌ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్‌ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. 

    సాంకేతికంగా

    సాంకేతిక అంశాల పరంగా ‘దూత’ సిరీస్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • నాగ చైతన్య నటన
    • సస్పెన్స్‌ & క్యూరియాసిటీ
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌
    • సాగదీత సీన్లు

    రేటింగ్‌: 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv