నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు
దర్శకుడు : వక్కంతం వంశీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
సంగీతం: హారిస్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్
విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023
‘భీష్మ’ సినిమా తర్వాత నితిన్ కెరీర్‌లో సరైన హిట్ పడలేదు. నాలుగు పరాజయాల తర్వాత నితిన్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man). వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ మూవీని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా… రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. వక్కంతం వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని సినిమా విడుదలకు ముందు నితిన్ చెప్పాడు. మూవీ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. మరి సినిమా ఎలా ఉంది? నితిన్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథ
అభి (నితిన్) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని హీరో కావాలన్నది అతడి కల. ఎక్స్ట్రా ఆర్టిస్ట్‌గా సాగిపోతున్న అభి లైఫ్‌లోకి మెరుపులా లిఖిత (శ్రీలీల) వస్తుంది. అభితో ప్రేమలో పడుతుంది. అంతా సజావుగా సాగుతున్న క్రమంలోనే అభికి హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి.. సైతాన్ పాత్రలోకి ఇన్‌వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు? ఎందుకు అభి సైతాన్‌లా మారాడు? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్)కి సైతాన్ సంబంధం ఏంటి ? చివరికి అభి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
మంచి ఎనర్జీతో ఉన్న అభి పాత్రలో నితిన్ చక్కగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే అద్భుతమైన బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించాడు. ముఖ్యంగా లుక్, స్టైలింగ్ బాగుంది. ఇక శ్రీలీల పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. నటనకు పెద్దగా స్కోప్ లేదు. పాటలకే ఆమె పరిమితమైంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రకు రాజశేఖర్ పూర్తి న్యాయం చేశారు. హీరోకి తండ్రిగా రావు రమేష్ చాలా బాగా నటించాడు. తనదైన పంచ్‌లతో ఫన్ క్రియేట్ చేశారు. ఆది, సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు వక్కంతం వంశీ ఎంచుకున్న స్టోరీ లైన్ బలహీనంగా ఉన్నప్పటికీ కథకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను నవ్వించడంలో ఆయన కొంతమేర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అయితే తొలి భాగంలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్‌హాఫ్‌లో కనిపించవు. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సన్నివేశాలను లాజిక్‌కు చాలా దూరంగా చూపించారు డైరెక్టర్. అటు హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్‌ను కూడా బలంగా చూపలేక పోయారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆశించే వారికి మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
టెక్నికల్‌గా
టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం, మ్యూజిక్ విభాగాల పనితీరు సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హారిస్ జయరాజ్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే సాగదీత సీన్లు అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉండాల్సింది.
ప్లస్ పాయింట్స్
- నితిన్ నటన
- హాస్య సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- బలహీనమైన స్టోరీ
- లవ్ ట్రాక్