• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా?

    నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య

    దర్శకుడు : ప్రశాంత్ వర్మ

    సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్

    సినిమాటోగ్రఫీ: శివేంద్ర

    ఎడిటింగ్: సాయిబాబు తలారి

    నిర్మాత: నిరంజన్ రెడ్డి

    ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథ

    సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ  సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. 

    సాంకేతికంగా

    ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. 

    ప్లస్ పాయింట్స్‌

    • కథా నేపథ్యం
    • తేజ సజ్జా నటన
    • గ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌

    రేటింగ్‌ : 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv