అమ్మాయిలకు ‘మన్మథుడు’, కుంటుంబ ప్రేక్షకులకు అన్నమయ్య, భక్త రామదాసు, యువతకు ‘శివ’, ప్రేమికులకు ప్రకాశ్….ఇలా తనదైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని తాకిన నటుడు నాగార్జున. అక్కినేని వారి నట వారసత్వంతో సినిమాల్లోకి వచ్చినా తన విలక్షణమైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్’గా పేరు సంపాదించిన ‘కింగ్’ నాగార్జున నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. YouSay ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్లోని విలక్షణతను ఓ సారి చూద్దాం.
అందరికీ భిన్నంగా ఉండటం వల్లే ‘కింగ్’
ఆగస్ట్ 29, 1959లో మద్రాస్‌లో పుట్టిన నాగార్జున 1967లోనే ‘సుడిగుండాలు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి సినిమాతో విజయాన్నందుకుని అక్కినేని నట వారసుడిగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత మజ్ను, ఆఖరి పోరాటం, జానకీ రాముడు వంటి సినిమాలో విజయ పరంపర కొనసాగించాడు. కానీ 1989లో వచ్చిన మణిరత్నం క్లాసిక్ మూవీ ‘గీతాంజలి’తో నాగార్జునకు అభిమాణులు పెరిగిపోయారు. ఓ ప్రేమికుడిగా నాగార్జున అభినయం ప్రేక్షకుల మనసు దోచింది. కానీ అందరు హీరోల్లా నాగార్జున మూస ధోరణిలో ముందుకెళ్లలేదు.
గేమ్ ఛేంజర్ ‘శివ’
1990 రామ్ గోపాల్ వర్మతో తీసిన శివ భారత సినీ ఇండస్ట్రీలోనే గేమ్ చేంజర్. ఈ సినిమా తర్వాత అప్పటికే షూటింగ్లో ఉన్న ఎన్నో సినిమాలు రీ షూట్ చేశారట. అలాంటి శివ విడుదలకు ముందు అందరూ భయపడ్డారు, కానీ ప్రయోగాలకు పెద్దపీట వేసే నాగార్జున ‘శివ’ ధైర్యంగా చేశాడు. ఆ సినిమా నాగార్జునను యువతలో మాస్ హీరోలా నిలబెట్టడమే గాక, ఇండస్ట్రీలో కొత్త స్టాండర్డ్స్‌ను సెట్ చేసింది. ఆ తర్వాత హిందీలోనూ నాగార్జునతోనే తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.
కామెడీ ధమాఖా ‘హల్లో బ్రదర్’
అప్పటిదాకా యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీలు చేస్తున్న నాగ్ 1996లో తనలోని కామెడీ యాంగిల్‌పై ప్రయోగం చేశాడు. ‘హల్లో బ్రదర్’గా నవ్వుల పువ్వులు పూయించి కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
యుక్త వయసులోనే అన్నమయ్య
నిన్నే పెళ్లాడతా వంటి రొమాంటిక్ సినిమా తీసిన తర్వాతి సంవత్సరమే కె. రాఘవేంద్రరావు ‘అన్నమయ్య’ స్క్రిప్ట్‌తో నాగార్జునను కలిశారు. అందరూ ఆ సినిమా వద్దని, కెరీర్ దెబ్బతింటుందని నాగార్జునను భయపెట్టారు. మళ్లీ లవ్ స్టోరీస్‌లో నటిస్తే తెలుగు ప్రేక్షకులు స్వీకరించలేరని నాగార్జున కూడా కాస్త భయపడ్డారు, కానీ ధైర్యం చేసి ముందడుగు వేసి చేసిన ‘అన్నమయ్య’ నాగార్జునకు తొలి జాతీయ అవార్డు సాధించిపెట్టింది. ఆ తర్వాత కూడా నాగార్జున భక్త రామదాసు, శిరిడీ సాయి, ఢమరుకం వంటి ఆధ్యాత్మిక సినిమాల్లో నటించారు.
అమ్మాయిల గుండెల్లో నిలిచిన ‘మన్మథుడు’
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల మాయాజాలంతో నవ్వులు, ప్రేమ, అద్భుతమైన మ్యూజిక్ సమాహారంతో ఫుల్ మీల్లా వచ్చిన సినిమా ‘మన్మథుడు’. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడమేగాక అమ్మాయిల మనసుల్లో నాగార్జునను మన్మథుడిని చేసింది.
నాగార్జున నట ‘ఊపిరి’
ఊపిరి సినిమాతో నాగార్జున ఏ టాప్ హీరో చేయని సాహసం చేశారు. ఫైట్లు లేవు, రొమాన్స్ లేదు, కుర్చీకే పరిమితమై ఉండే ఓ పాత్ర. అందుకు ఎటువంటి హీరో అయినా నో చెబుతాడు కానీ కింగ్ ఆ సినిమా చేశారు. బాక్సాఫీస్ వద్ద అది బ్లాక్ బస్టర్.
ఇవే గాక నాగార్జున ఎన్నో ప్రయోగాలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. అందులో కొన్ని విజయాలను కట్టబెడితే మరికొన్ని పరాజయాలను అందించాయి. అయినా ఆ సెల్యూలాయిడ్ సైంటిస్ట్ తన ప్రయోగాలు మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ సినిమాతో మరోసారి తన యాక్షన్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు ప్రేక్షకులను నాగ్ మరికొంత కాలం ఇలాగే అలరిస్తూ, తన వారసత్వానికి కూడా పోటీగా నిలవాలని కోరుకుందాం.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!