నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతిహాసన్ తదితరులు
రచన, దర్శకత్వం: శౌర్యువ్
సంగీతం: హషీమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్
నిర్మాత: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్.
నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల: 07-12-2023
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకొచ్చిన ఈ జనరేషన్ హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటారు. ఇమేజ్, ట్రెండ్ అంటూ లెక్కలేసుకోకుండా సినిమాలు చేస్తుండటం నాని ప్రత్యేకతగా చెప్పవచ్చు. దసరా సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. విడుదలకి ముందే నాని – మృణాల్ జోడీ, ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
విరాజ్ (నాని) ముంబైలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. తన కూతురు మహి(కియారా) అంటే అతడికి ప్రాణం. కూతురికి సరదాగా కథలు చెప్తుంటాడు విరాజ్. ఆ కథల్లో హీరోగా నాన్ననే ఊహించుకుంటూ ఉంటుంది మహి. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటే విరాజ్ చెప్పడు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో జరిగిన ఓ ప్రమాదం నుంచి మహిని యష్న (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. వారిద్దరు కాఫీ షాపులో ఉండగా పాపను వెత్తుకుంటూ విరాజ్ అక్కడకు వస్తాడు. అక్కడే మహికి అమ్మ కథ చెప్తాడు విరాజ్. ఇంతకి ఆ కథలో ఏముంది? వర్ష పాత్ర ఎవరిది? యష్నకీ, మహి తల్లికీ సంబంధం ఏమిటి? యష్న.. విరాజ్‌ని ఎలా ప్రేమించింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
నాని (Hero Nani) మరోసారి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని బరువెక్కించాడు. చిన్నారితో కలిసి ఆయన పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్రధానబలం. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని నాని కళ్లలోనే చూపించాడు. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగుంది. ఇద్దరూ చాలా బాగా నటించి పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేమ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోనూ మృణాల్ నానితో పోటీపడి మరి నటించింది. తన అభినయంతో కట్టిపడేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా కనిపిస్తూ కంటతడి పెట్టించింది. ప్రియదర్శి, అంగద్ బేది, జయరామ్, విరాజ్ అశ్విన్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడిగా శౌర్యువ్‌కి ఇది తొలి చిత్రమే అయిన ఎంతో అనుభవం ఉన్నట్లు సినిమాను తెరకెక్కించారు. కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. అసభ్యతకి తావు ఇవ్వకుండా అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. అయితే కొన్ని స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్లో నెరేషన్ కూడా కాస్త మైనస్ అని చెప్పవచ్చు. అయితే సినిమాకు అవసరమైన భావోద్వేగాలను పండించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో విజయం సాధించారు. కుటుంబ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ‘హాయ్ నాన్న’లో పుష్కలంగా ఉన్నాయి.
సాంకేతికంగా..
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కథకి తగ్గ సన్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ మూవీకి ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు. అటు హేషమ్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సమయమా సాంగ్ సినిమా మొత్తం ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్, కూర్పు సరిగ్గా కుదిరాయి.
ప్లస్ పాయింట్స్
- నాని, మృణాల్, కియారా నటన
- భావోద్వేగాలు, మలుపులు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- ఊహకు అందే కథ
- సాగదీత సీన్లు