‘భయం నా బయోడేటాలోనే లేదురా బ్లడీ ఫూల్’ అంటాడు బాలయ్య ఓ సినిమాలో. నిజ జీవితంలో అలాంటి మనుషులు అయితే ఉన్నారో లేదో గానీ ఓ జంతువు మాత్రం ఉంది. ఈ భూమ్మీద మోస్ట్ ఫియర్‌లెస్ యానిమల్‌గా దానికి పేరుంది.
సింహాలకు వణుకు
సింహాల గుంపును కూడా అది వణికించగలదు. కానీ అది ఏ జంతువుకూ వణకదు. భయం దాని కళ్లలో కనిపించదు. తిరగబడి ఎగబడేలా చేస్తుందే గానీ తలవంచి వెనకడుగు వేయదు. అదే హనీబ్యాడ్జర్(Honey badger). దీనినే రాటెల్(ratel) అని కూడా అంటారు.
ఆఫ్రికా, సౌత్ వెస్ట్ ఆసియా, భారత ఉపఖండంలో హనీబ్యాడ్జర్లు కనిపిస్తాయి. మెలివోరా జీనస్‌లో మిగిలిన ఏకైక జాతి హనీబ్యాడ్జర్. భయమే లేని జీవులుగా ఇవి ఉండటానికి ప్రధాన కారణం వాటి ఆకారం, శరీర నిర్మాణమే. వీటి చర్మం చాలా మందంగా ఉంటుంది. ఏ జంతువు దాడి చేసినా చీల్చడం అంత సులభం కాదు. మెడచుట్టూ ఏకంగా 6mm మందంతో ఉంటుంది దీంతో సింహాలు, పులుల వంటివి మెడ పట్టుకున్నా దీని శ్వాస ఆపడం చాలా కష్టమైన పని. శరీరమంతా తోలు వదులుగా ఉండి ఇది సులభంగా ఎటువైపైనా కదిలేందుకు అణువుగా ఉంటుంది. చిన్న కళ్లు, మొహంతో ప్రత్యర్థుల దాడిని తప్పించుకునేందుకు వీలుగా దీని శరీరాకృతి ఉంటుంది. బలమైన చిన్న కాళ్లు, మరింత బలమైన గోళ్లు ఉంటాయి.
చూడటానికి 30 ఇంచుల పొడవు, 15-16 కిలోల బరువుతో చూడటానికి చిన్నగానే కనిపించినా… వీటి దూకుడు తత్వం, క్రూరమైన ఆత్మరక్షణ సామర్థ్యం హనీబ్యాడ్జర్లకు భయమే లేని జీవులుగా పేరు సంపాదించి పెట్టాయి. సింహాలు, అత్యంత క్రూరమైన హైనాలను కూడా ఇవి ఎదురించి తప్పించుకోగలవు. అందుకు ఈ వీడియోనే ఉదాహరణ.
హనీబ్యాడ్జర్లు కేవలం బలమైన, భయంలేని జీవులు మాత్రమే కాదు తెలివైనవి కూడా. ఆహారాన్ని సంపాదించడానికి ఇవి తెలివిగా వ్యవహరించగలవు. అది ఓ ప్రయోగం ద్వారా స్పష్టమైంది. హనీబ్యాడ్జర్‌కు అందకుండా చెట్టుకు ఆహారాన్ని వేలాడదీశారు. దానికి సమీపంలోనే ఆ ఆహారన్ని అందుకునేందుకు ఎత్తుకు చేరుకునేలా ఓ బాక్స్ ఉంచారు. హనీబ్యాడ్జర్ ఆ బాక్స్‌ను జరుపుకుని ఆహారాన్ని సంపాదించగలిగింది.
హనీబ్యాడ్జర్లు సాధారణంగా బొరియలను తవ్వి ఉంటాయి. తేనెటీగల లార్వా, కీటకాలు, కప్పలు, తాబేళ్లు, పాములు పక్షులు, గుడ్లను కూడా తింటాయి. దుంపలు, వేర్లు కూడా తింటాయి. చర్మం, వెంట్రుకలు, ఈకలు, మాంసం మరియు ఎముకలతో సహా ఆహారంలోని అన్ని భాగాలను మింగేసి ఆరగించుకోగలదు.
మనుషులు పెంచుకోవచ్చా?
హనీబ్యాడ్జర్లకు ఉన్న విపరీత తత్వం, వాటి శారీరక సామర్థ్యాలు జనావాసాల్లో సరిపడవు. కోళ్లు, బాతుల వంటి వాటిని సులభంగా చంపి తినేస్తాయి. అలాగే వాటి దూకుకు కళ్లెం వేయడం మానవతరం కాదు. కుక్కల సాయంతో కూడా వాటిని ఏమీ చేయలేం. అంతేగాక కెన్యా వంటి దేశాల్లో రేబిస్ వ్యాప్తికి హనీబ్యాడ్జర్లు ప్రధాన కారకాలుగా ఉన్నాయి.