ఐపీఎల్2022 తుది అంకానికి చేరుకుంది. ఈసారి కొత్త జట్లు, కొత్త ఆటగాళ్లు, ఉత్కంఠభరితమైన మ్యాచ్ లతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. మెగావేలం నుంచి మొదలైన సందడి ఇంకా సాగుతోంది. లీగ్ ప్రారంభానికి ముందు ఉన్న అంచనాలన్నీ తలకిందులు చేస్తూ జట్లు ప్రదర్శించాయి. అసలు ప్లే ఆఫ్స్ చేరడమే కష్టమనుకున్న రెండు కొత్త జట్లు అనూహ్య ప్రదర్శనతో ఆహా అనిపించాయి. అరివీర భయంకర టీంలు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచాయి. 70 మ్యాచ్ ల లీగ్ దశ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
మరో మాటలేకుండా ఈ సీజన్ హైలైట్ రెండు కొత్త జట్లే. ముఖ్యంగా గుజరాత్.. అసలు లీగ్ దశను దాటలేదనుకున్న జట్టు ఏకంగా ఫైనల్ కు దూసుకెళ్లింది. హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా ఇలా ఒక్కొక్కరు ఒక్కో మ్యాచులో టీంను నిలబెట్టారు. గుజరాత్ గెలిచిన లాస్ట్ ఓవర్ మ్యాచులు ఈ సీజన్ కే హైలైట్ గా నిలిచాయి. చాలా మ్యాచుల్లో మునిగే పడవను కూడా పైకి లేపి ఒడ్డుకు చేర్చారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ సామర్థ్యం కూడా ఈ సీజన్ తో బయటపడింది. మరో కొత్త జట్టు లక్నో.. రాహుల్ కెప్టెన్సీలో అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్లో వెనుదిరిగింది. కొత్త జట్లు అలా ఆశ్చర్యపరిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రెండు జట్లు చెన్నై, ముంబయి అంచనాలను తలకిందులు చేశాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి చెత్త రికార్డును మూటగట్టుకున్నాయి. కీలక ఆటగాళ్లు రాణించకపోవడం ముంబైని దెబ్బతీస్తే…కెప్టెన్సీ మార్పులు సీనియర్ల ఫాం లేమి చెన్నైని కుంగదీసింది.
గుజరాత్ టాప్ లో, చెన్నై,ముంబై అడుగున పక్కనబెడితే మిగతా జట్లన్నీ ప్లే ఆఫ్స్ ఆశల కోసం చివరిదాకా పోరాడాయి. చివరి వారం వరకూ ఎవరి స్థానం ఎక్కడన్నది స్పష్టత లేకుండా సాగింది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచి టాప్-2లో నిలుస్తారేమో అనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత అనూహ్యంగా చతికిలపడింది. దిల్లీ విజయపరంపరను కొనసాగించలేక ఇబ్బంది పడినా పోరాడింది. రాజస్థాన్, ఆర్సీబీ , పంజాబ్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో పోరాడాయి. ఓ దశలో 5 జట్లు 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఆ తర్వాత 14 పాయింట్లతో 3 జట్లు నిలిచాయి. చివరికి నెట్ రన్ రేట్ చూసే పరిస్థితులు కూడా తలెత్తాయి. కానీ లక్నో, రాజస్థాన్ 9మ్యాచులు గెలిచి దర్జాగా వారి స్థానం ఖాయం చేసుకోగా… చివరగా ముంబై దిల్లీని ఓడించడంతో ఆర్సీబీకి మార్గం సుగమమైంది. ఇక ఆటగాళ్లలో జాస్ బట్లర్, రాహుల్, గిల్, వార్నర్ బ్యాటింగ్ మెరుపులు, చాహల్, ఉమ్రాన్ మాలిక్, హసరంగ , బుమ్రాల 5వికెట్ల ప్రదర్శనలు ఆటను రసవత్తరంగా మార్చాయి.
మ్యాచులు ఎలా సాగినా ఈ సారి కొంతమంది యువ ఆటగాళ్లు సంచలనాలు సృష్టించారు. భారత క్రికెట్ భవిష్యత్ పై భరోసా ఇచ్చారు.ఈ సీజన్ అందించిన ఆణిముత్యాల్లో ఉమ్రాన్ మాలిక్ మొదటి స్థానంలో ఉంటాడు. ఈ జమ్ము ఎక్స్ ప్రెస్ తన వేగంతో అత్యుత్తమ బ్యాటర్లను కూడా ముప్పతిప్పలు పెట్టాడు. గంటకు 157కి.మీ. వేగవంతమైన బంతితో రికార్డు సృష్టించాడు.తన ప్రదర్శనతో ఇండియా జట్టులోనూ చోటు సంపాదించాడు. హైదరాబాద్ జట్టుకే చెందిన అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి జట్టు కోసం పరుగుల వరద పారించారు. దీపక్ చాహర్ గైర్హాజరులో ముఖేష్ చౌదరి చెన్నైకి కీలక బౌలర్ గా రాణించాడు. కోల్ కతాకు రింకూసింగ్ మెరుపులు పలు మ్యాచ్లు గెలిపించాయి. ముంబయి జట్టులో తిలక్ వర్మ తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు. ఇక ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీ మరిచిపోలేనిది. వేలంలో అమ్ముడుపోని ఆటగాడు కీలక మ్యాచ్ లో ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించి ఔరా అనిపించాడు. లక్నోలో ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్, ముంబయిలో రమణ్ దీప్ సింగ్, గుజరాత్ లో సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, యశ్ దయాల్ ఇలా 10మందికి పైగా యువతరం ఐపీఎల్ లో మెరుపులతో టీమిండియా భవిష్యత్ ఆశాజ్యోతులుగా కనిపిస్తున్నారు.