నటీనటులు: రజినీకాంత్, తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వినాయకన్ తదితరులు.
డైరెక్టర్: నెల్సన్ దిలీప్ కుమార్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సరైన సక్సెస్ అందుకోలేదు. ‘బీస్ట్’ మూవీ పరాజయం అనంతరం, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న చిత్రం ఇది. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం(ఆగస్ట్ 10) విడుదలైన ఈ చిత్రం రజినీకి సక్సెస్ ఇచ్చిందా? థియేటర్లలో ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసిందా? అనే అంశాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే?
టైగర్ ముత్తువేల్ పాండ్యన్(రజినీకాంత్) ఒక జైలర్‌గా పనిచేసి రిటైర్ అవుతాడు. భార్య, కొడుకు, కోడలు, మనవడితో సంతోషంగా కుటుంబాన్ని నడుతుపుతుంటాడు. కొడుకు అర్జున్ ఒక నిఖార్సైన పోలీస్ అధికారి. ఓ హై ప్రొఫైల్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో అర్జున్ అదృశ్యమౌతాడు. కొడుకు కోసం వెతకడం ప్రారంభించిన ముత్తువేల్ ఎవరైనా చంపేసి ఉంటారేమోనని భావిస్తాడు. కానీ, ప్రాణాలతోనే ఉన్నట్లు, విలన్ గ్యాంగ్ తన కొడుకును బంధించినట్లు తెలుసుకుంటాడు. వారి నుంచి విడిపించుకోవడానికి ముత్తువేల్ ఏం చేశాడు? విలన్ గ్యాంగ్ చేసిన డిమాండ్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది?
కమర్షియల్ సినిమాకు రజినీ మార్క్ ఎలివేషన్స్ సినిమాను నిలబెట్టాయి. కొన్ని సన్నివేశాలు రజినీ ‘శివాజీ’ సినిమా గుర్తొచ్చేంతలా ఉంటాయి. ఫస్టాఫ్‌లో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ దగ్గరపడే కొద్దీ కథ కాస్త సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి రేగుతుంది. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ రజినీ ఫ్యాన్స్‌కి పండగలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. రజినీ మార్క్ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా కుదిరింది. యాక్షన్ డోజ్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండాఫ్‌లో ఓ సౌత్ హీరో కేమియో ఆశ్చర్యపరుస్తుంది. అయితే, కొన్ని చోట్ల కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ‘కావాలా’ పాటపై అంచనాలు పెరగడంతో తెరపై ఊహించిన విధంగా ఉండదు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
జైలర్‌గా రజినీకాంత్‌కి ఫుల్ మార్కులే వేయొచ్చు. యాక్షన్ సీన్స్‌లో మ్యానరిజంతో ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే యాక్షన్ స్ట్రెంత్ చూపించాడు. స్టైల్, కామెడీ టైమింగ్‌తో ఫర్వాలేదనిపించాడు. ఇక, కామెడీతో యోగిబాబు మరోసారి అదరగొట్టేశాడు. రజినీతో వచ్చే సన్నివేశాల్లో హాస్యాన్ని పండించాడు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌గా వినాయకన్ మెప్పించాడు. వైవిధ్యాన్ని చూపిస్తూ భయపెట్టాడు.
టెక్నికల్‌గా..
గత సినిమాల్లో చేసిన తప్పులను నెల్సన్ దిలీప్ కుమార్ సరిదిద్దుకున్నట్లే. జైలర్ విషయంలో నెల్సన్ పక్కగా వ్యవహరించాడు. ఎన్నో గూస్‌బంప్స్ మూమెంట్స్‌ని తెరపై పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. ఇక, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో బలం. రజినీ నడుస్తున్నప్పుడు కూడా విజిల్స్ వేయాలనిపించే నేపథ్య సంగీతాన్ని అందించాడు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలు సహజంగా అనిపించేలా లైటింగ్, కలర్ టోన్ బాగా నప్పింది. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ వేసిన సెట్స్ బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్
రజినీ ఎలివేషన్స్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
డార్క్ కామెడీ
నెగెటివ్ పాయింట్స్
బోర్ కొట్టించే సన్నివేశాలు