ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే?
జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్ 19) ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.
తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్
మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
జానీ మాస్టర్ టాప్-10 సాంగ్స్
జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్ -10 సాంగ్స్ ఏవో ఇప్పుడు చూద్దాం
మేఘం కరిగేనా (తిరు)
తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో ‘తిరు’ పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని ‘మేఘం కరిగేనా’ సాంగ్‌ను జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. ధనుష్, నిత్య స్టెప్పులను నెక్స్ట్ లెవల్లో కంపోజ్ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.
అరబిక్ కుతు (బీస్ట్)
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్ కంపోజ్ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్ బెస్ట్ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది.
రంజితమే (వారసుడు)
విజయ్, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్ కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటలో విజయ్, రష్మిక డ్యాన్స్ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్ చివరిలో వచ్చే సింగిల్ టేక్ స్టెప్ విజయ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.
రారా రక్కమ్మ (విక్రాంత్ రోణ)
విక్రాంత్ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్ దేశంలోని మ్యూజిక్ లవర్స్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్ అందించిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్ స్టెప్‌పై రీల్స్ చేసి వైరల్ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.
నువ్వు కావాలయ్యా (జైలర్)
రజనీకాంత్ గత చిత్రం ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్న వేసిన హుక్ స్టెప్‌కు యూత్ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి. రీల్స్ సైతం పెద్ద ఎత్తున చేశారు.
రౌడీ బేబీ (మారి 2)
సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్ చిత్రీకరణ జరిగింది.
బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు.
సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం)
‘రేసుగుర్రం’లోని మాస్ బీట్ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేయడం విశేషం.
లైలా ఓ లైలా (నాయక్)
రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు.
ఏం మాయో చేశావే (ద్రోణ)
2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ టాలెంట్ చూసిన నితిన్ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. నితిన్ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్ తర్వాత నుంచి జానీ మాస్టర్ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!