నటీనటులు: చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
నిర్మాతలు: కె.వివేక్, సాయికృష్ణ, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్, ఉపేంద్ర వర్మ
సమర్పణ: రానా దగ్గుబాటి
విడుదల: 03-11-2023
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కథలను అందించడంలో తనకు సాటి లేరని చాటి చెప్పారు. సున్నితమైన కథలతో వల్గారిటీ లేని కామెడీని పుట్టించి తరుణ్ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. అటువంటి తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో చిత్రం ‘కీడా కీలా’ (Keeda Cola). ఈ చిత్రం ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందా? తరుణ్ భాస్కర్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? వంటి ప్రశ్నలకు ఈ రివ్యూలో సమాధానాలు తెలుసుకుందాం.
కథ
వాస్తు (చైతన్యరావు), వరదరాజు (బ్రహ్మానందం) తాత మనవళ్లు. లాయర్ అయిన కౌశిక్ (రాగ్ మయూర్)తో కలిసి డబ్బు కోసం ఓ ప్లాన్ వేస్తారు. తాత కోసం కొన్న శీతల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింకని చూపించి యజమానిని బ్లాక్‌మెయిల్ చేయాలని పన్నాగం పన్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోవైపు జీవన్ కార్పొరేటర్ కావాలని ఆశపడుతుంటాడు. 20 ఏళ్లు జైల్లో ఉండి బయటికి వచ్చిన తన అన్న నాయుడు (Tharun bhascker) అండతో ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు. వీరికి కూడా డబ్బు అవసరం పడటంతో నాయుడు, జీవన్ కూడా ఓ వ్యూహం పన్నుతారు. మరి వీళ్లందరి ప్రయత్నాలు ఫలించాయా? డబ్బు సంపాదించారా? వాస్తు గ్యాంగ్, జీవన్ గ్యాంగ్ ఎలా కలిశారు? తదితర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా సాగిందంటే
సరదా సరదా సన్నివేశాలతో ప్రథమార్ధం వేగంగా పూర్తవుతుంది. నాయుడుగా తరుణ్ భాస్కర్ ఎంట్రీతో కథలో మరింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయన చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం మరింత సందడిగా అనిపిస్తుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనల్లో నటిస్తూ హీరోగా గెటప్ శీను చేసే సందడి, వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని సరెండర్ అంటూ చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. నాయుడుని అంతం చేయడానికి వచ్చిన షార్ప్ షూటర్స్ చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌గా నిలుస్తాయి. బ్రహ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే పరిమితమైనా సందర్భానుసారంగా నవ్విస్తుంది.
ఎవరెలా చేశారంటే?
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో నటుడిగానూ అద్భుత నటన కనబరిచాడు. నాయుడుగా ఆయన కనిపించిన విధానం, నటన, కామెడీ టైమింగ్ సినిమాకి ప్రధానబలం. బ్రహ్మానందం పాత్ర పరిధి తక్కువే అయినా చివరి వరకూ సినిమాపై ఆయన పాత్ర ప్రభావం కనిపిస్తుంటుంది. హీరో చైతన్యరావు వైకల్యం ఉన్న యువకుడిగా కనిపించాడు. మాటల్ని సరిగ్గా పలకలేని పాత్రలో మంచి నటనని ప్రదర్శించాడు. రాగ్‌మయూర్, జీవన్, విష్ణు, రఘు, రవీంద్ర విజయ్, గెటప్ శీను కీలక పాత్రల్లో కనిపిస్తారు. చిన్న చిన్న పాత్రలు కూడా సినిమాలో నవ్విస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
తరుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్రమిది. ఈ కథని నడిపించిన విధానం, రచనలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్, సంగీతం, మాటలు, పాత్రల హావభావాలతో ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే తరుణ్ భాస్కర్ గత చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. తొలి రెండు సినిమాల్ని వాస్తవికతకి పెద్ద పీట వేస్తూ ఆయన సన్నివేశాల్ని నడిపించారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, నవ్వించడమే టార్గెట్ అన్నట్టుగా స్వేచ్ఛగా ఇందులో సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. చెప్పుకోదగ్గ కథ లేకపోయినా, కొన్ని సన్నివేశాలు ఊహకు తగ్గట్టుగా సాగుతున్నా ప్రేక్షకుల్ని మాత్రం కడుపుబ్బా నవ్వించడంలో తరుణ్ భాస్కర్ మరోమారు విజయం సాధించాడు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. తరుణ్ భాస్కర్ తెలివైన రచన ఇందులో చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్ని మాటల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాటలతో తనే సెన్సార్ చేస్తూ నవ్వించారు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- నటులు
- హాస్య సన్నివేశాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- ఊహకందే కథనం
- రొటిన్ స్టోరీ