నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023
తమిళ స్టార్ నటుడు విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఫైట్స్‌లో విజయ్ తన మార్క్ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘లియో’లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన స్టైల్‌ను అనుసరించాడు. సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, ‘విక్రమ్’, ‘జైలర్’ చిత్రాలతో పోలిస్తే ‘లియో’ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్ మార్క్ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- విజయ్ నటన
- సినిమాటోగ్రఫీ
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- పాటలు
- సాగదీత సీన్స్
చివరిగా : లోకేష్ కనగరాజ్ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో ‘లియో’ కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!