ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రామా కథతో తెరకెక్కిన సినిమాకు ఏమాత్రం తీసిపోని జీవితం అతడిది. గుండెతరిగే ఆవేదన..గుండె ధైర్యాన్నిచ్చే పోరాటం. ఓ ప్రేమ, ఓ స్నేహం, అభిమానం, అవమానం, సంతోషం,దు:ఖం.. ఊహించని మలుపులు, అగాథం నుంచి ఆకాశానికి ఎగిసిన స్ఫూర్తి ఇది సినిమా కథ కాదు. దినేశ్ కార్తిక్ నిజజీవిత ప్రయాణం. రీల్ స్టోరీ ‘జెర్సీ’లో నానిని చూసి ఎంతో మంది కదిలిపోయారు. కానీ దినేేశ్ కార్తిక్ కథ అంతకు రెండింతల భావోద్వేగాలున్న రియల్ స్టోరీ. 37 ఏళ్ల వయసులో టీ20ల్లో గ్రేట్ ఫినిషర్ గానే డీకే మనకు తెలుసు కానీ అతడి జీవితంలో గతం మిగిల్చిన గాయాలెన్నో. భారత్ టీ20లు ఆడటం మొదలుపెట్టినపుడు జట్టులోకి వచ్చినా… అర్ధశతకం చేసేందుకు 15 ఏళ్లు పట్టిందంటే అందుకు కారణం అతడి గతంలోని విషాదమే. ‘నా’ అనుకున్న వాళ్ల నమ్మక ద్రోహానికి, మోసానికి గురై మరణం అంచుల దాకా వెళ్లాడు. కానీ కాలం బుల్లెట్ వేగంతో విసిరిన బంతిని సిక్స్ గా మలిచి గెలిచాడు.
అద్భుతంగా మొదలు..అంతలోనే మలుపు
తమిళనాడులో తెలుగు కుటుంబంలో పుట్టిన దినేశ్ కార్తిక్…..వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ధోని కన్నా ముందే భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2004లో టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. 2006 డిసెంబర్ లో భారత్ ఆడిన తొలి టీ20లో ఆడాడు. దేశవాళీలో తమిళనాడు జట్టుకు కెప్టెన్ గా, భారత జట్టులో అద్భుతమైన ఫినిషర్ గా 2007లో అతడి కెరీర్ అత్యంత అద్భుతంగా సాగింది. అప్పటికి దినేశ్ కార్తిక్ వయసు 21 ఏళ్లు మాత్రమే. కెరీర్ పరంగా ఎలాగూ సెట్ అయ్యామనుకుని చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి నిఖిత వంజరను 2007లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక జీవితం పూలవనమే అనుకున్నాడు. కానీ అక్కడే అతడి ప్రయాణం చీకటి మలుపు తిరిగింది.
ఓ నమ్మక ద్రోహం, ఓ మోసం
తమిళనాడు జట్టుకే చెందిన మురళీ విజయ్ దినేశ్ కార్తిక్ కు స్నేహితుడు. దినేశ్ టీమిండియాకు ఎంపికైనప్పటికి విజయ్ ఇంకా జట్టులోకి రాలేదు. అయితే స్నేహితుడిని కలిసేందుకు తరచూ తన ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే నిఖితతో మురళీ విజయ్ కి పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా ఆ తర్వాత వివాహేతర సంబంధంగా మారింది. ఇదిలా సాగుతుండగానే మురళీ విజయ్ 2009లో ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు. 2010లో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక అప్పటినుంచి విజయ్, నిఖిత సంబంధం మరింత హద్దులు మీరింది. ఒక్కసారిగా కోట్లు వచ్చి పడటంతో మురళీ విజయ్ నిఖితను ఖరీదైన బహుమతులతో మరింత ఆకట్టుకున్నాడు. వారి అనైతిక బంధం మరింత బలపడింది.
అంతా శూన్యం..జీవితమంతా చీకటిమయం
మురళీ విజయ్, నిఖిత వంజర గురించి ఎవరెన్ని చెప్పినా దినేశ్ నమ్మలేదు. ప్రాణస్నేహితుడిని, అర్ధాంగిని ఇసుమంతైనా అనుమానించలేదు. కానీ 2012లో ఓ వార్త విని కుప్పకూలాడు. తమిళనాడు-కర్ణాటక మధ్య మ్యాచ్ జరుగుతున్నపుడు నిఖిత నెలతప్పిందనే వార్త వచ్చింది. కానీ అందుకు కారణం దినేశ్ కార్తిక్ మాత్రం కాదు. దీంతో స్నేహితుడు , ప్రాణంగా ప్రేమించిన భార్య చేసిన మోసానికి ఒక్కసారిగా ఒంటరివాడయ్యాడు. ఆట లయ తప్పింది. టీమిండియాలో చోటు పోయింది. ఐపీఎల్ లోనూ విఫలమయ్యాడు. రంజీల్లో తోటి ఆటగాళ్ల అవమానాలు ఎదుర్కొన్నాడు. డిప్రెషన్ తో ఆటను వదిలి, వ్యాయామం మాని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఓ దశలో ఆత్మహత్య చేసుకుందామని కూడా ఆలోచించాడు.
దినేశ్ జీవితంలో తానే వెలుగు ‘దీపిక’
పూర్తి విషాదంలో కూరుకుపోయిన దినేశ్ కార్తిక్ కు అతడి జిమ్ కోచ్ జీవితంపై ఆశలు రేకెత్తించాడు. అతడిలో స్ఫూర్తిని నింపి మళ్లీ జిమ్ బాట పట్టించాడు. అక్కడే పరిచయమైంది ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్. ఓ అద్భుత ఆటగాడిని ఆమె అలా చూడలేకపోయింది. అతడిలో మరింత స్ఫూర్తిని నింపి తిరిగి ఆటపై దృష్టి సారించేలా చేసింది. దినేశ్ వ్యక్తిత్వానికి మనసు పారేసుకుంది. 2015లో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత డీకే మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీపిక కూడా ఆటలో అద్భుతంగా రాణిస్తూ అర్జున, పద్మ అవార్డులు గెలుచుకుంది.
అదొక భావోద్వేగాల మ్యాచ్
2018లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో దినేశ్ కార్తిక్, మురళీ విజయ్ ఇద్దరూ ఉన్నారు. ఓ దశలో వారిద్దరూ కలిసి బ్యాటింగ్ చేయాల్సివచ్చింది. కానీ మురళీ విజయ్ కనీసం దినేశ్ కార్తిక్ కళ్లలోకి చూడలేకపోయాడు. స్నేహితుడికి చేసిన మోసం అతడిని తలెత్తుకోనివ్వలేదు. కానీ వీరిద్దరి వ్యక్తిగత సమస్యల కారణంగా ఆ తర్వాత జట్టులో ఇద్దరూ స్థానం కోల్పోయారు.
అయిపోయిందనుకున్నాడు..కానీ మొదలైంది
కోల్ కతా జట్టుకు మూడు సీజన్లు కెప్టెన్ గా జట్టులో మంచి ఫినిషర్ గా, వ్యక్తిగత జీవితంలోనూ ఆనందంగా ఉన్న సమయంలో దినేశ్ ఇక సంతృప్తిగా క్రికెట్ కు గుడ్ బై చెబుదామనుకున్నాడు. 2020లో కేకేఆర్ కెప్టెన్సీ వదిలేశాడు. ఓ చానల్ లో వ్యాఖ్యాతగా కూడా చేశాడు. కానీ సెలక్షన్ టీం అతడిని 2020 టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది. దీంతో క్రికెట్ ప్రయాణం మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఆ టోర్నీ ఈ అక్టోబర్ లో జరగబోతోంది. ఇకఐపీఎల్ 2022 సీజన్లో ఫినిషర్ గా డీకే ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికా సిరీస్ లోనూ 37 ఏళ్ల వయసులో టీ20లో అర్ధసెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు.
కాలం విసిరిన సవాళ్లను ఎదిరించి..పడిలేచిన కెరటంలా ఎగిసిపడిన దినేశ్ కార్తిక్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అతిచిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకునే నేటికాలం యువతకు ఓ చక్కని పాఠం. దినేశ్ కార్తిక్ ఇదే స్ఫూర్తితో మరెన్నే మైలురాళ్లు అధిగమించాలని కోరుకుందాం..