నటీనటులు: సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి, సాహితి దాసరి, అక్షత శ్రీనివాస్ తదితరులు
దర్శకుడు : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
నిర్మాత: గౌరీ కృష్ణ
సంగీతం: జ్ఞాని
సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి
విడుదల తేదీ : నవంబర్ 03, 2023
2021లో వచ్చిన మా ఊరి పొలిమేర (Maa Oori Polimera) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజైన ఈ చిత్రం అత్యధిక ఆదరణను సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అందరికీ నచ్చేయడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) ఇవాళ (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వాటిని అందుకుందా? పార్ట్-1 లాగే విభిన్నమైన కథాంశంతో మెప్పించిందా? సత్యం రాజేష్ నటన ఎలా ఉంది? వంటి అంశాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే రెండో భాగం ప్రారంభమవుతుంది. ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా సాగిదంటే
పొలిమేర పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2 మెుదలవుతోంది. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు డైరెక్టర్. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టులు మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. పార్ట్ 1లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. పార్ట్-1లో లాగే పార్ట్-2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి వాటికి సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశారు.
ఎవరెలా చేశారంటే?
కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ అదరగొట్టాడు. పార్ట్ 1లో నటించిన అనుభవంతో ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేరకు నటించాడు. తొలి భాగంతో పోలిస్తే ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువే. ఇక బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
కథ, కథనాన్ని నడిపించడంలో దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలన్న ఉద్దేశంతోనే కొన్ని ట్విస్టులను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి కథకు ఏ మేరకు అవసరమనేది డైరెక్టర్ పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం వల్ల ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఆడియన్స్‌లో నెలకొంటుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల ఆయన భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- సత్యం రాజేశ్ నటన
- కథలోని ట్విస్ట్‌లు
- నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథనం
- లాజిక్ లేని సీన్స్
చివరిగా: థ్రిల్లింగ్ సినిమాలను ఇష్టపడే వారికి ‘మా ఊరి పొలిమేర 2’ కచ్చితంగా నచ్చుతుంది. ట్విస్టులు, క్రైమ్ సీన్స్, క్లైమాక్స్‌కు వారు బాగా కనెక్ట్ అవుతారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం