మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పాగా వేయాలని చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచి క్రమంగా ఇక్కడ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. గత రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించడం ఇందుకు ఉదాహరణ. మరోవైపు, బీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ కాలు దువ్వుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తోంది. ఓటు బ్యాంకును మెరుగు పర్చుకుని ఎలాగైనా సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. బీజేపీ కూడా పోటీ పడుతోంది.
టీడీపీకి పెట్టని కోటగా..
నియోజకవర్గంలో టీడీపీకి మెరుగైన ఓటు బ్యాంకు ఉండేది. గతంలో నాలుగు దఫాలు ఈ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, క్షేత్ర స్థాయిలో నాయకత్వ లోపం కారణంగా క్రమంగా పార్టీ కనుమరుగైంది. మధ్యలో కాంగ్రెస్ ఒకట్రెండు సార్లు సీటు గెలుచుకుంది.
భౌగోళికంగా..
భౌగోళికంగా ఈ నియోజకవర్గం మెదక్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రం కావడం ప్రధాన బలం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మెదక్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు విడిపోగా, మరికొన్ని మండలాలు చేరాయి. టేక్మాల్, అల్లాదుర్గం, పెద్ద శంకరంపేట విడిపోగా, రామాయంపేట, నిజాంపేట మండలాలు చేరాయి. ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. పాడి పరిశ్రమ సమృద్ధిగా ఉంది. ప్రఖ్యాత మెదక్ చర్చి ఈ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండటం అదనపు ఆకర్షణ.
సానుకూలతలు..
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. దళిత బంధు పంపిణీ సజావుగా సాగుతోంది. రోడ్లు, పారిశుద్ధ్యాన్ని ప్రభుత్వం క్రమంగా మెరుగు పరుస్తోంది. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించడంతో తాగు నీటికి ఇక్కట్లు తప్పాయని స్థానికులు చెబుతున్నారు. పైగా, ఎమ్మెల్యే అభ్యర్థికి స్థిరమైన క్యాడర్ ఉండటం సానుకూలాంశం.
ప్రతికూలతలు..
రోడ్డు, రవాణాను ప్రభుత్వం క్రమంగా మెరుగు పరుస్తోంది. అయినప్పటికీ, కొన్ని గ్రామీణ ప్రాంతాలకు సౌకర్యవంతమైన రోడ్డు సదుపాయం లేదు. ఉపాధి సమస్య ప్రధానంగా ఉంది. సాగు, తాగు నీరు వందశాతం అందుబాటులో ఉండట్లేదని స్థానికులు వాపోతున్నారు. సింగూరు డ్యాం జలాలు పూర్తిగా మెదక్ నియోజకవర్గానికే కేటాయించాలనే డిమాండ్ నెలకొంది. వివిధ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. నియోజకవర్గం పరిధిలోని ‘నిజాం దక్కన్ షుగర్ లిమిటెడ్’ పరిశ్రమ మూతపడంతో స్థానికంగా చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ పరిశ్రమను మూసివేయడంతో పరోక్షంగా చెరుకు సాగుపై ప్రభావం చూపించింది. నియోజకవర్గంలో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. అయితే, ఇందులో 90శాతానికి పైగా పూర్తికాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి ఆమెకే టిక్కెట్?
మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం ఉంది. 2014 నుంచి ఈమె ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి కిందటిసారి ఎన్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ తరఫున ఈయన ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. కిందటి సారి బీజేపీ అభ్యర్థిగా ఆకుల రాజయ్య పోటీకి దిగారు.
డిసైడింగ్ ఫ్యాక్టర్..
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 16.36శాతం, ఎస్టీ జనాభా 8.46శాతంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీల వాటా అత్యధికం. వీరు విజేతను నిర్ణయించగలరు.
నియోజకవర్గ అభివృద్ధి, పెండింగ్ పనుల పూర్తి, ఉపాధి సమస్యలు గెలుపోటములను ప్రభావితం చేసే ఆస్కారముంది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!