హిందీలో తెరకెక్కిన ’12th ఫెయిల్’ (12th Fail) చిత్రం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మేధా శంకర్ (Medha Shankar)కు రోజు రోజుకూ నెట్టింట ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మేధా శంకర్ గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం.
నోయిడాలో పుట్టిన ఈ భామ (Medha Shankar).. ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. అనంతరం మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
ఎఫ్‌బీబీ నిర్వహించిన ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లో పాల్గొని మేధా అందరి దృష్టిని ఆకర్షించింది. పోటీల్లో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది.
మోడలింగ్‌లోనే కాకుండా సంగీతంపైనా మేధా (Medha Shankar)కు పట్టు ఉంది. సితార్, హార్మోనియం, కీబోర్డు ప్లే వంటి వాటిల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుంది.
నటనపై మక్కువతో నోయిడా నుంచి ముంబయికి మకాం మార్చిన మేధా.. ‘విత్ యు ఫర్ యు ఆల్వేజ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది.
ఆ తర్వాత హిందీ వెబ్‌సిరీస్‌లలో నటించే ఆవకాశాన్ని దక్కించుకుంది. బీకమ్ హౌజ్ (2019), దిల్ బేకరార్ (2021) సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత ‘శాదీస్తాన్’ (2021) సినిమాతో మేధా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. సంగీతం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో అర్షి మోదీ పాత్రలో ఆమె ఆకట్టుకుంది.
2022లో వచ్చిన ‘మ్యాక్స్, మిన్ అండ్ మ్యూజికీ’లో భాయ్‌ఫ్రెండ్‌ను త్యాగం చేసే అమ్మాయిగా యువతను మెప్పించింది.
ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితం కావడంతో మేధా శంకర్ పేరు ప్రముఖంగా బాలీవుడ్‌లో వినిపించింది.
మూడో సినిమా ’12th ఫెయిల్’తో శ్రద్ధా జోషిగా ఒదిగిపోయి విశేష క్రేజ్ సంపాదించుకుంది మేధా. అందులోని ‘బోలో నా’ పాటను స్వయంగా ఆమె పాడటం విశేషం.
‘12th ఫెయిల్’ విడుదలకు ముందు 16వేల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం 20 లక్షలకు చేరుకుంది.
సోషల్‌మీడియా మేధా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం షేర్ చేస్తున్న ఫొటోలకు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
ఇక ’12th ఫెయిల్’ సినిమాకు వస్తే.. ఐపీఎస్ అధికారి మనోజ్‌కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేధా ఆయన సతీమణిగా నటించింది.
ఈ స్ఫూర్తిదాయక చిత్రం ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధిక వీక్షణలతో దూసుకువెళ్తోంది. ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కెరీర్ తొలినాళ్లలో ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన మేధా శంకర్ ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుగోగలమని ఓ సందర్భంలో పేర్కొంది.
సవాళ్లు విసిరే పాత్రలనే సినిమాల్లో ఎంచుకుంటానని మేధా చెబుతోంది. నటన జీవితంలో ఓ భాగమేగానీ అదే జీవితం కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్