• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?

  నటీనటులు : అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్‌ వర్మ, రాశిక దుగల్‌, హర్షిత గౌర్‌, షాజీ చౌదతరి తదితరులు

  దర్శకులు : గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌

  సినిమాటోగ్రాఫర్‌ : సంజయ్‌ కపూర్‌

  నిర్మాత : ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని

  విడుదల తేదీ : జులై 5, 2024

  ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌

  ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లలో ‘మీర్జాపూర్‌’ (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్‌ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్‌ కావడం, వీటిలోని బోల్డ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్‌పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్‌ కోసం యూత్‌తోపాటు  ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మూడో సీజన్‌.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్‌ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

  గత సీజన్లలో ఏం జరిగిందంటే?

  మీర్జాపూర్‌ మొదటి సీజన్‌లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే  ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్‌ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది.

  మీర్జాపూర్‌ సీజన్‌ 3 కథేంటి

  కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్‌ 2లో కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్‌ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్‌ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్‌ చేశాక కూడా కాలిన్‌ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్‌ 3 చూడాల్సిందే. 

  ఎవరెలా చేశారంటే

  గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్‌ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు. 

  డైరెక్షన్ ఎలా ఉందంటే

  గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్‌ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్‌గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్‌ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే  ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్‌ సిరీస్‌కు కేరాఫ్‌గా మారిన హింసను మాత్రం సీజన్‌లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్‌ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఇవ్వకపోవడం ఈ సీజన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా లేకపోవడం యూత్‌కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్‌ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్‌ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు.

  టెక్నికల్‌గా..

  సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి. 

  ప్లస్‌ పాయింట్స్‌

  • ప్రధాన తారగణం నటన
  • ట్విస్టులతో కూడిన పొలిటికల్‌ డ్రామా
  • నేపథ్య సంగీతం

  మైనస్‌ పాయింట్స్‌

  • ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడం
  • సాగదీత సన్నివేశాలు
  •  గత సీజన్లతో  పోలిస్తే యూత్‌ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం

  Telugu.yousay.tv Rating :3/5 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv