అనుకున్నదే అయింది. ఊహించినదే నిజమైంది. కల సాకారమైంది. ఇద్దరు తెలుగు వీరులు చేసిన డ్యాన్స్‌కి ఆస్కార్ ఫిదా అయింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంది. తెలుగు కీర్తి పతాకం విశ్వవ్యాప్తంగా రెపరెపలాడింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పాశ్చాత్య పాటలను తలదన్ని అవార్డును సొంతం చేసుకుంది. భారతీయ సినిమా సత్తా ఏంటో విశ్వ వేడుకపై నిరూపించింది.
అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్..
ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం ‘ఇప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు’ అని కీరవాణి పాటపాడుతూ చెప్పడం గూస్‌బంప్స్ తెప్పించింది. ‘నాటు నాటు’ సాంగ్‌ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పాటగా తీర్చిదిద్దాలని భావించాం. ప్రతి భారతీయుడూ గర్వపడాలని ఆశించాం. అది జరిగింది. నాకు, రాజమౌళికి, మా ఫ్యామిలీకి ఉన్న చిరకాల కోరిక నేడు నెరవేరింది. అకాడమీకి ధన్యవాదాలు’ అంటూ కీరవాణి చెప్పారు. అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నమస్తే’ అని చెప్పారు.
ఎగిరి గంతేశారు..
‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డును ప్రకటించగానే బాల్కనీలో కూర్చొన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎగిరి గంతేసింది. డైరెక్టర్ రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ చిన్నపిళ్లల్లా కేరింతలు కొట్టారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ విజయ నినాదాలు చేశారు.
‘నాటు నాటు’తోనే మొదలు..
ఆస్కార్ వేడుక ప్రారంభమైంది ‘నాటు నాటు’ సాంగ్‌తోనే. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రజెంటర్‌గా ఎంపికైన ‘దీపిక పదుకొణె’ ‘నాటు నాటు’ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం సింగర్స్‌ని ఆహ్వానించింది. ‘మీరెప్పుడైనా నాటు నాటు పాటను చెవులారా విన్నారా? కళ్లారా చూశారా? లేకపోతే ఇదే అసలైన సమయం. నాటు నాటు పాటను తిలకిస్తూ ఎంజాయ్ చేయండి’ అంటూ దీపిక పదుకొణె ప్రకటించడం భారతీయ సినిమాకే గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అంతేగాకుండా ‘నాటు నాటు’ సాంగ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆస్కార్ వేడుకలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లను ఆహ్వానించిన సమయంలో హాలీవుడ్ ప్రముఖులు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ మర్చిపోలేనిది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో..
‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అప్పుడు మొదలైన ‘నాటు నాటు’ మేనియా అవార్డు అందుకునే వరకూ జోరుగా కొనసాగింది. ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ ప్రభావం క్లియర్‌గా కనిపించింది.
‘నాటు నాటు’కు ప్రాణం..
‘నాటు నాటు’ సాంగ్ ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర కొరియోగ్రఫీదే. ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు ‘నాటు నాటు’ను విశ్వవిజేతగా నిలిపాయి. గేయ రచయిత చంద్రబోస్ తెలుగుదనాన్ని మేళవించి రచించగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బీట్స్ జత చేయగా సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ గొంతెత్తి పాడగా రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ సాంగ్‌ని ఉక్రెయిన్‌లో షూట్ చేశారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!