ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పెషల్‌గా సిట్‌ను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా పదకొండు రోజుల పాటు ప్రాయిశ్చిత దీక్ష సైతం చేపట్టారు. ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ కూడా మెట్లను శుభ్రం చేసి ప్రాయిశ్చిత్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్‌పై పవన్ నిప్పులు చెరిగారు. హిందూ ధర్మంకు అన్యాయం జరిగితే మాట్లాడొద్దా? అంటూ మండిపడ్డారు. దీంతో పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వరుసగా ప్రశ్నలు సందిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
నిప్పు రాజేస్తున్న ప్రకాష్ రాజ్!
తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపై ఎక్స్ (ట్విటర్) వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్. ప్రాయిశ్చిత దీక్షలో భాగంగా విజయవాడ వచ్చిన పవన్, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాష్ రాజ్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత నుంచి పవన్‌ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేయడం మెుదలుపెట్టారు. పేరు ప్రస్తావించకుండానే వరుస పోస్టులు పెడుతున్నారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా ‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్’ అని ట్వీట్ పెట్టారు.
పవన్ – కార్తీ ఇష్యూ పైనా కామెంట్స్
సోమవారం జరిగిన ‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్ లడ్డు ప్రస్తావన తీసుకురాగా ‘ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది’ అంటూ పరిహాసమాడారు. దీనిపై దుర్గ గుడి వేదికగా పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో వాళ్లు మాట్లాడితే పద్దతిగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చొండి అని హెచ్చరించారు. దీనిపై వెంటనే స్పందించిన కార్తీ పవన్‌కు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రకాష్ రాజ్ పవన్‌కు చురకలు అంటించారు. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్…’ అంటూ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత ‘గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? అంటూ ఎక్స్‌లో మరో పోస్టు పెట్టారు.
ఎందుకంత తీటా?
ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తుండటంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నీకు సంబంధం లేని వ్యవహారంలో ఎందుకు తలదూరుస్తున్నావ్? అంటూ నిలదీస్తున్నారు. పవన్ తను పాటించే సనాతన ధర్మం గురించి మాట్లాడితే రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. హిందువులపై వారి నమ్మకాలపై దాడి జరిగితే ప్రశ్నించవద్దా? అని మండిపడుతున్నారు. తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ హిందువులను దూషించినప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని నిలదీస్తున్నారు. తను నమ్మిన ధర్మం కోసం పవన్ పోరాడితే నీకొచ్చిన తీట ఏంటని పలుష పదజాలంతో ఏకిపారేస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారం హిందువుల విశ్వాసాలకు సంబధించిందని పరాయి మతానికి కొమ్ముకాసే నీలాంటి వ్యక్తులకు దానిపై మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. తిరుమల లడ్డును బాంబుతో పోలుస్తూ ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది నమ్మక ద్రోహమే!
నటుడు ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీతో తొలి నుంచి మంచి అనుబంధమే ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనకు సోదర సమానుడు అంటూ పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన మా అసోసియేషన్ ఎలక్షన్స్‌లో ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని మెగా ఫ్యామిలీ బలపరిచింది. మంచు విష్ణుకి పోటీగా ప్రకాష్ రాజ్ బరిలో నిలవడంలో చిరంజీవి ప్రోత్సాహాం ఎంతో ఉంది. మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రకాష్ రాజ్‌కు మద్దతు ప్రచారం కూడా చేశారు. ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడు, అనుభవజ్ఞుడు, జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తి మా అసోసియేషన్‌కు అధ్యక్షుడు అయితే ఇండస్ట్రీకి మంచి జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పవన్‌ను టార్గెట్ చేసి మెగా ఫ్యామిలీకి ప్రకాష్ రాజ్ నమ్మక ద్రోహం చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరో పోసాని అవుతారా?
ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్ల వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇండస్ట్రీలో ఆయన మరో పోసాని కృష్ణమురళి అయ్యేటట్లు కనిపిస్తోంది. గత వైకాపా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నటుడు పోసాని, మెగా ఫ్యామిలీని పదే పదే తన మాటలతో టార్గెట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్‌ను చూస్తుంటే ఒకప్పటి పోసాని గుర్తుకు వస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో బలమైన ఫ్యామిలీతో పెట్టుకోవడం ద్వారా సినిమా అవకాశాలను పోసాని కోల్పోయినట్లు టాక్ ఉంది. దీంతో ప్రకాష్ రాజ్ కూడా ఇదే తీరున వ్యవహరిస్తే ఆయనకూ అదే పరిస్థితి ఎదురుకావొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ vs ప్రకాష్ రాజ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?