టాలీవుడ్‌కు చెందిన స్టార్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఒకరు. ఒకప్పుడు పూరి నుంచి సినిమా వచ్చిందంటే మాస్ ఆడియన్స్‌తో థియేటర్లు దద్దరిల్లేవి. పూరి మార్క్ డైలాగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించేవి. అయితే గత కొలంగా పూరి మేనియా కనిపిచడం లేదు. ‘పోకిరి’, బిజినెస్ మ్యాన్’ ‘టెంపర్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు రావడం లేదు. పూరి జగన్నాథ్ గత చిత్రం ‘లైగర్’ (Liger) దారుణంగా ఫెయిల్ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకప్పటి పూరి తమకు మళ్లీ కావాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) పూరికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పూరి ఈ విషయాన్ని స్వయంగా పంచుకున్నారు.
‘సినిమా తీసే ముందు నాకు చెప్పండి’
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 11) హనుమకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు. ‘హిట్ సినిమా తీస్తే చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్. నాకో సాయం చేస్తారా? అని అడిగారు. ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్. నేనేం హెల్ప్ చేయాలి? అని మనసులో అనుకున్నా. తదుపరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా? అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’ అని పూరి చెప్పారు.
కథ చెప్పాల్సింది కదా!
డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం. డైరెక్టర్లలో తనకు పూరి జగన్నాథ్ ఇష్టమని గతంలో ఓ ఇంటర్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన మొబైల్ వాల్‌పేపర్‌గా పూరి జగన్నాథ్ ఫొటో పెట్టుకోవడం కూడా చూపించారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ తనను కథ చెప్పమని అడిగితే తాను చెప్పలేదని పూరి జగన్నాథ్ షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపతున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర వర్మ స్వయంగా కథ చెప్పాలని సూచిస్తే పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ స్టోరీ చెప్పి ఉంటే అందులోని తప్పొప్పులను ఆయన సూచించేవారు కదా అని పోస్టులు పెడుతున్నారు. రిస్క్ తీసుకోకుండా ఆయనకు స్టోరీ చెప్పుంటే బాగుండేదని అంటున్నారు.
మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి!
‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెగిటివ్ రివ్యూలు చూసి థియేటర్లకు రావడం మానివేసే వారికి పరోక్షంగా కీలక సూచనలు చేశాడు. ‘మనలో చాలా మంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్ విషయంలోనూ అంతే. పక్కవారి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’ అని రామ్ అన్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్ వ్యాఖ్యలను మెజారిటీ నెటిజన్లు సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు.