నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనుంజయ, జగదీశ్ ప్రతాప్ భండారి, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్ తదితరులు
రచన, దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: నవీన్ యెర్నేని, రవి యలమంచిలి
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల: 05-12-2024
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించి మరింత హైప్ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.
కథేంటి
ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహాద్ ఫాజిల్)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్ బయలుదేరగా సీఎంతో ‘ఓ ఫొటో తీసుకొని రా’ అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్ ఎలాంటి ప్లాన్స్ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మెస్మరైజ్ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో గ్లామర్ డోస్ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్ సుకుమార్ పుష్ప రాజ్ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్, మైండ్ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్ ఇంట్రో, పుష్ప – షెకావత్ టామ్ అండ్ జెర్రీ ఫైట్, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్ వేశారు సుకుమార్.
టెక్నికల్‌గా..
సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
- అల్లు అర్జున్ నటన
- యాక్షన్ సీక్వెన్స్
- జాతర ఎపిసోడ్
- సంగీతం
మైనస్ పాయింట్స్
- తేలిపోయిన విలనిజం
- సెకండాఫ్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!