మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్ స్పాట్ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్ లుక్ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్ ఛేంజర్’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వెంటాడుతున్న లీకుల బెడద!
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ కియారా ఫొటోలు లీక్ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.
దసరా, సంక్రాంతి పరిశీలన!
గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్ పుట్టిన రోజు నాడు ‘జరగండీ.. ‘ పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్ పనులు ప్లానింగ్ చేసుకొని డేట్ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.
చిరు – చరణ్ – తారక్.. బిగ్ ఫైట్!
అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్’ ఫిక్స్ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్ ఫైట్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించిన తారక్‌తో రామ్ చరణ్ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్!
ఇక గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే ‘యానిమల్‘లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.