ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన నార్జో సిరీస్‌లో నార్జో 70 ప్రో 5జీని (Realme Narzo 70 Pro) తాజాగా లాంచ్ చేసింది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, ఎయిర్ గెశ్చర్స్ వంటి కొత్త ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన Redmi Note 13 Pro మెుబైల్‌కు పోటీగా ఈ ఫోన్ భారత్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ రెడ్‌మీ ఫోన్‌తో పోలిస్తే ఈ నయా రియల్‌మీ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కలిగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో Realme Narzo 70 Pro, Redmi Note 12 Pro ఫీచర్లు ఎలా ఉన్నాయి? దేని ధర ఎంత? ఏది కొంటే బెటర్? వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
మెుబైల్ స్క్రీన్
రియల్‌మీ నార్జో 70 ప్రో మెుబైల్.. 6.67 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి 120Hz రిఫ్రెష్ రేటు, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ ఐ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక Redmi Note 13 Pro ఫీచర్లకు వస్తే.. ఈ మెుబైల్ 6.67 అంగుళాల AMOLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1220×2712 (FHD+) పిక్సెల్స్ హెచ్‌డీ రిజల్యూషన్, 500 nits పీక్ బ్రైట్‌నెస్ అందించారు. ఈ మెుబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత HyperOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై వర్క్ చేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
రియల్‌మీ నార్జో 70 ప్రో.. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8 జీబీ+128 జీబీ, 8 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో వీటిని పొందవచ్చు. Redmi Note 13 Pro విషయానికి వస్తే ఈ ఫోన్ ఏకంగా ఐదు స్టోరేజ్ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. 8GB RAM / 128GB, 8GB RAM / 256GB, 12GB RAM / 256GB, 12GB RAM / 512GB, 16GB RAM / 512GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఈ మెుబైల్‌ను పొందవచ్చు. microSD కార్డు సాయంతో ఈ రెండు ఫోన్లలో స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. అయితే అధిక స్టోరేజ్ సామర్థ్యాన్ని కోరుకునే వారికి రెడ్‌మీ నోట్ 13 ప్రో బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.
కెమెరా
ఈ రెండు మెుబైల్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. రియల్‌మీ నార్జో 70 ప్రో.. 50 MP ప్రైమరి కెమెరా + 8 MP అల్ట్రావైడ్ + 2 MP మ్యాక్రో సెన్సార్ విత్ ఫ్లాష్‌ను కలిగి ఉంది. ముందు వైపు 16 MP సెల్ఫీ కెమెరాను కూడా అమర్చారు. అటు రెడ్‌మీ ఫోన్.. 200MP ప్రైమరి కెమెరా + 8 MP అల్ట్రావైడ్, 2 MP మాక్రో సెన్సార్‌తో అందుబాటులో ఉంది. దీనికి ముందు వైపు 16MP కెమెరాను ఫిక్స్ చేశారు. కెమెరాల పరంగా చూస్తే ఈ రెండు ఫోన్లలో రెడ్‌మీ నోట్ 13 ప్రో కాస్త బెటర్ పొజిషిన్‌లో ఉంది. రియల్‌మీలో ప్రైమరి కెమెరా 50MPగా ఉంటే దీనిలో ఏకంగా 200MP ఉంది.
బ్యాటరీ
బ్యాటరీల పరంగా చూస్తే ‘Realme Narzo 70’ మెుబైల్.. 5000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. దీనికి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. 1-50% ఛార్జింగ్‌కు ఈ ఫోన్ 19 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటుందని రియల్‌మీ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది. అటు రెడ్‌మీ నోట్ 13ప్రో కాస్త బెటర్‌గా 5100 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 0-50% శాతానికి 17 నిమిషాలు, 100% ఛార్జింగ్‌కు 44 నిమిషాల సమయం తీసుకుంటుంది. బ్యాటరీ పరంగా చూస్తే రెడ్‌మీది కాస్త పైచేయిగా కనిపిస్తోంది.
స్పెషల్ ఫీచర్స్
రియల్‌మీ నార్జో 70 ప్రో.. కొత్తగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, ఎయిర్ గెశ్చర్స్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్‌లో భాగంగా స్క్రీన్ షాట్ తీయడం, ఇన్‌స్టా రీల్స్ పైకి మూవ్ చేయడం వంటి 10 రకాల గెశ్చర్స్‌ను స్మార్ట్‌ఫోన్‌ను తాకకుండానే చేయొచ్చు. తడి చేత్తోనూ ఫోన్ డిస్‌ప్లేను ఆపరేట్ చేయడానికి వీలుగా రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను ఇచ్చారు. అయితే Redmi Note 13 Pro మెుబైల్‌లో ఈ తరహా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లేవు.
కనెక్టివిటీ ఫీచర్స్
రియల్ నార్జో 70 ప్రో మెుబైల్.. Wi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.2, A2DP, LE, GPS, GLONASS, GALILEO, BDS, QZSS, USB Type-C 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కాంపస్ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. అటు రెడ్‌మీ 13ప్రో మెుబైల్ కూడా ఇంచు మించు ఇలాంటి కనెక్టివిటీ ఫీచర్లనే కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్
రియల్‌మీ నార్జో 70 ప్రో మెుబైల్ రెండు కలర్ వేరియంట్లను మాత్రమే కలిగి ఉంది. గ్రీన్ (Green), గోల్డ్ (Gold) రంగుల్లో ఈ ఫోన్ పొందవచ్చు. అయితే రెడ్‌మీ నోట్ 13 ప్రో.. మిడ్నైట్ బ్లాక్ (Midnight Black), అరోరా పర్పుల్ (Aurora Purple), ఓషియన్ టీల్ (Ocean Teal), ఆర్కిటిక్ వైట్ (Arctic White) వంటి రంగుల్లో లభిస్తోంది.
ధర ఎంతంటే?
రియల్‌మీ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ వేరియంట్ల ఆధారంగా నిర్ణయించింది. 8 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.18,999, 8 జీబీ+ 256 జీబీ మోడల్ ధర రూ.19,999గా పేర్కొంది. మార్చి 22 నుంచి అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోళ్లపై డిస్కౌంట్ ఇస్తున్నారు. అటు Redmi Note 13 Pro 5G మెుబైల్ కూడా వేరియంట్ల ఆధారంగా రేట్లను కలిగి ఉంది. 8GB+128GB ధర రూ. 25,999, 8GB+256GB ధర రూ.27,999, 12GB+256GB ధర రూ.29,999గా ఉంది.
ఏదీ కొంటే బెటర్?
ఓవరాల్‌గా చూస్తే Realme Narzo 70 Pro మెుబైల్ కంటే Redmi Note 13 Pro కాస్త బెటర్ ఫీచర్లను కలిగి ఉంది. కెమెరా, బ్యాటరీ, స్టోరేజ్, కలర్ ఆప్షన్స్ ఇలా అన్నింటిలోనూ రెడ్‌మీదే పై చేయిగా కనిపిస్తోంది. అయితే రియల్‌మీ మెుబైల్‌తో పోలిస్తే రెడ్‌మీ నోట్ 13 ప్రో ధర కాస్త ఎక్కువ. అంతేకాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ రియల్‌మీతో పోలిస్తే కాస్త వెనకబడి ఉంది. రియల్‌మీ ఆండ్రాయిడ్ 14పై పనిచేస్తే.. రెడ్‌మీ ఆండ్రాయిడ్ 13 OSతో వర్క్ చేస్తుంది. ధర సమస్య కాకుంటే రెడ్‌మీ 13 ప్రో ట్రై చేయవచ్చు. మీ బడ్డెట్‌కు ఏమైనా పరిమితులు ఉంటే రియల్‌మీ నార్జో 70 ప్రోకు వెళ్లవచ్చు.