గౌతమ్ మీనన్ దర్శకుడిగా శింభుతో మరోసారి జతకట్టిన తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘లైఫ్ ఆఫ్ ముత్తు’. ‘వెందు తానిందాదు కాదు’ తమిళ సినిమా తెలుగు వెర్షన్‌గా ఇవాళ థియేటర్లో విడుదలైంది. గౌతమ్ మీనన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన కమ్‌బ్యాక్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి లైఫ్ ఆఫ్ ముత్తుతో గౌతమ్ మీనన్ మరోసారి మ్యాజిక్ చేశాడా..చూద్దాం..
ముత్తు కథేంటి?
ఓ మారుమూల ప్రాంతంలో తల్లి, సొదరితో కలిసి నివసించే ఓ కుర్రాడు జీవితంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో ముంబయికి చేరుకుంటాడు. అక్కడ ఓ అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్న ఓ హోటల్‌లో పనికి చేరతాడు. కానీ కాలం పరిస్థితులు అతడిని మరోవైపుకు తీసుకెళ్తాయి. అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతబట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అండర్ వరల్డ్ ప్రపంచమే ఇప్పటిదాకా చూడని ఓ గ్యాంగ్‌స్టర్‌గా ముత్తు ఎదుగుతాడు.ఇదీ కథ.
ఎలా ఉందంట?
కథ సింపుల్‌గానే మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించినా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తీరు అద్భుతం. ప్రేమ, నమ్మకం, మోసం, డబ్బు, అధికారం, మంచి , చెడు ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ మనలో మనకే ఆలోచనలు రేకెత్తిస్తాడు. డైలాగులు, కథనం అద్భుతంగా సాగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. ఆ తర్వాత కూడా మనకు ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమా నడుస్తుంది. ‘జీవితం మనకు రెండు ఆప్షన్లు ఇచ్చినపుడు మనం దేనిని ఎంచుకుంటామన్న దానిపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది’. ఈ పాయింట్‌ను సినిమాలో ముత్తుతో పాటు శ్రీధరణ్ అనే మరో పాత్రను తీసుకుని బాగా చూపించారు. తప్పని పరిస్థితుల్లో ముత్తు తుపాకి పట్టుకుంటే అతడి స్నేహితుడు మరో మార్గం ఎంచుకుంటాడు. ఈ ఇద్దరి ప్రయాణాన్ని సమాంతరంగా చూపిన తీరు మనల్ని కట్టిపడేస్తుంది.
సాంకేతికంగా…
కథ, కథనం ఎంత అద్భుతంగా సాగాయో ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతే గొప్పగా ఉంది. సాధారణంగా స్క్రీన్ ప్లే ఆధారంగా నడిచే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో BGM కీలకంగా ఉంటుంది. ఆ మేరకు రెహమాన్ తానేేంటో మరోసారి చూపించారు. రెహమాన్ ఈ సినిమాకు మరో హీరో అని చెప్పొచ్చు. ఆంటోని ఎడిటింగ్, సిద్ధార్థ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా బోర్ కొట్టకుండా బాగా చేశారు.
నటీ నటులు
శింభు కెరీర్‌లో ఈ సినిమా తప్పక నిలిచిపోతుంది. నటుడిగా ఈ సినిమాలో శింభు మరో మెట్టు ఎక్కాడు. ఓ విధంగా చెప్పాలంటే కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించింది. ఇతర నటులు కూడా తమ పాత్రల మేరకు అదరగొట్టారు.
ఫైనల్ గా..
గౌతమ్ మీనన్ అభిమానులకు ఈ సినిమా మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్ డ్రామాలు ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన సినిమా.