తమిళనాడు నుంచి వచ్చి తెలుగుమ్మాయిగా మారిపోయింది సాయిపల్లవి. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే పరిమితుల్ని, హద్దుల్ని ఆమె చెరిపేసింది. హీరోయిన్ ఎలా ఉన్నా, గ్లామర్ షో చేయకపోయినా, మేకప్ వేసుకోకపోయినా, సహజంగా కనిపించినా ప్రేక్షకులు కేవలం టాలెంట్ చూసి ఆదరిస్తారని చెప్పేందుకు ఉదాహరణగా నిలిచింది. ఆమె అభినయంతో పాటు డ్యాన్స్‌కు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. సాయిపల్లవి నటిస్తుందంటే ఆ సినిమా గ్యారెంటీ హిట్, సాయిపల్లవి ఒక పాత్ర చేస్తుందంటే కచ్చితంగా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది అనిపించుకుంటుంది. మొదటి సినిమా ఫిదా నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు వచ్చే గార్గి వరకు ఆమె చేసిన పాత్రలు అన్నీ బలమైనవే. సాయి పల్లవి గార్గి మూవీకి విడుదలకు ముందే 5/5 రేటింగ్. కచ్చితంగా ఇది సాయిపల్లవి నటించాల్సిన పాత్రల అని దర్శకులు రాసుకున్న కథలే.
ఫిదా
భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లా అంటూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ తెలుగు వాళ్ల మనసు దోచుకుంది సాయిపల్లవి. ఇక అక్కడనుంచి ఆమె విజయ ప్రస్థానం మొదలయింది. ఫిదా మూవీలో భానుమతిది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. స్వేచ్ఛగా ఆలోచించే అమ్మాయి పెళ్లయిన తర్వాత కూడా తన ఊళ్లోనే ఉంటూ తండ్రిని దగ్గరుండి చూసుకోవాలనుకుంటుంది. ఆమె గట్టిగా అనుకోవడంతో పరిస్థితులు కూడా అనుకూలించి ప్రేమించిన వరుణ్ కూడా అమెరికా వదలి వచ్చి ఆమె ఊర్లో హాస్పిటల్ పెట్టుకుంటాడు. అల్లరి, గడుసుతనంతో పాటు లోతైన ఆలోచన, పట్టుదల ఉన్న అమ్మాయి భానుమతి పాత్రలో సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
విరాటపర్వం
విరాటపర్వం వెన్నెల అనే ఒక అమ్మాయి ప్రేమ కథ. నక్సలైట్ నాయకుడైన రవన్న రాసిన రచనల్ని చదవి అతడిని ఆరాధిస్తుంది. ప్రేమించిన వాడికోసం తల్లిదండ్రులతో పాటు సమాజాన్ని ఎదురించి, కట్టుబాట్లు చెరిపేసి, అతడి ఆశయాలకు తోడుగా నిలవాలనుకుంటుంది. అతడితోనే నా జీవితం అనుకొని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని అడవిలో కాలు పెట్టే బలమైన పాత్రలో ఆమె నటించిన తీరుకు మన్ననలు అందుకుంది. ఇలాంటి పాత్రలు చేయాలంటే సాయిపల్లవి తప్ప మరో ఆప్షన్ లేదన్నట్లుగా గుర్తింపు తెచ్చుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నెల అనే అమ్మాయి పాత్రలో జీవించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ పాత్ర ఆమె సినీ కరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది.
గార్గి
గార్గి సినిమాలో తండ్రి కోసం పోరాడే ఒక అమ్మాయిగా మరో బలమైన పాత్రలో సాయిపల్లవి నటించనుంది. జులై 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా చూసి తమిళంలో హీరో సూర్య దంపతులు, కన్నడలో రక్షిత్ శెట్టి, తెలుగులో రానా ఇందులో భాగం కావాలని కోరుకున్నారంటే అందులో ఎంత కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో సాయిపల్లవి గార్గి అనే ఒక స్కూల్ టీచర్‌గా నటిస్తోంది. అన్యాయంగా జైలులో పెట్టిన తన తండ్రిని విడిపించేందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ, న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ పోరాడే పాత్రలో సాయిపల్లవి నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆమె కెరీర్‌లో ఇదొక మరో గుర్తుండిపోయే పాత్ర కాబోతుందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
వీటితో పాటు సాయిపల్లవి తెలుగులో నటించిన లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో కూడా చాల ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించింది. లవ్ స్టోరీ సినిమాలో కూడా ఊరు వదిలి పట్నం వచ్చిన అమ్మాయి మౌనిక పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇందులో లవ్‌స్టోరీతో పాటు సమాజంలో ఉన్న చాలా సున్నితమైన అంశాల్ని తెలియజేశారు. ఇందులో సాయిపల్లవి నటనతో పాటు ఆమె డ్యాన్స్ ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో ఆమె నటకు మంచి ప్రశంసలు లభించాయి. అప్పటివకు వెస్ట్రన్ డ్యాన్స్ అలవోకగా చేసేఆమె ఆ సినిమాకోసం ప్రత్యేకంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. మైత్రేయి( రోజీ) పాత్రలో గతం నుంచి వస్తున్న ఒక దురాచారాన్ని మంటగలిపి, దేవుళ్లుగా భావిస్తున్న రాక్షసుల్ని ఎదురించి శ్యామ్‌సింగరాయ్‌తో జతకట్టి అతడిని పెళ్లి చేసుకొని ఆమెలాంటి వారికి తోడుగా నిలుస్తోంది.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమెకు ఇక్కడ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అభిమానులు ఆమెను ప్రేమగా లేడీ పవర్‌స్టార్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే పవర్‌స్టార్‌కు ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో ఇప్పుడు సాయిపల్లవి కూడా అంతటి అభిమానాన్ని సంపాదించుకుంది. సౌత్‌లో పెద్ద స్టార్స్‌తో పాటు మెగాస్టార్ లాంటి వాళ్లే ఆమె నటనకు, డ్యాన్స్‌ను ప్రశంసిస్తూ పలుసార్లు వేదికలపై మాట్లాడిన సంగతి తెలిసిందే. అందరిలా కాకుండా తనకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తన స్టైల్‌లో వరుస సినిమాలో దూసుకెళ్తుంది ఈ భామ.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!