నటీనటులు: కార్తి, అరవింద స్వామి, శ్రీవిద్య, రాజ్‌కిరణ్ తదితరులు
రచన, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్
సంగీతం: గోవింద్ వసంత
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు
ఎడిటింగ్: ఆర్.గోవింద రాజు
నిర్మాత: జ్యోతిక, సూర్య
విడుదల తేదీ: 28-09-2024
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా ‘96’ వంటి ఫీల్ గుడ్‌మూవీని తెరకెక్కించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెయ్యజగన్’. తెలుగులో ఈ మూవీని ‘సత్యం సుందరం’ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో ప్రముఖ నటుడు అరవింద స్వామి కీలక పాత్ర పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జోతికలు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇవాళ (సెప్టెంబరు 28) (meiyazhagan release date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గుంటూరుకు చెందిన సత్యం (అరవిందస్వామి) ఆస్తి తగదాల కారణంగా పుట్టి పెరిగిన ఇల్లు, ఊరిని వదిలేసి వైజాగ్ వెళ్లిపోతాడు. ఈ క్రమంలో 30ఏళ్లు గడిచిపోతాయి. బాబాయి కూతురి పెళ్లి కోసం ఊరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఊరికి వచ్చిన సత్యంకి పెళ్లిలో బంధువు (కార్తీ) పరిచయమవుతాడు. బావా అంటూ సరదాగా కలిసిపోతూ బోలెడు కబుర్లు చెబుతుంటాడు. అతని మీతిమీరిన కలుపుగోలు తనం చూసి సత్యం జిడ్డులా భావిస్తాడు. అయితే కలిసి ప్రయాణం చేసే కొద్దీ అతను చూపే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం మనసును కట్టిపడేస్తాయి. మరి వీళ్లిద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ ప్రయాణంలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో అతనికున్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా? లేదా? అన్నది మిగతా కథ.
ఎవరెలా చేశారంటే
సత్యం పాత్రలో నటుడు అరవిందస్వామి పూర్తిగా ఒదిగిపోయాడు. తన అద్భుతమైన నటనతో ఆ పాత్రతో మనమూ ట్రావెల్ చేసేలా చేశాడు. సత్యం పడే బాధ, యాతన, ఇబ్బంది వంటి అన్ని ఫీలింగ్స్‌ను మనం కూడా అనుభవిస్తాం. ఇక కార్తీ తన అమాయకత్వంతో మరోసారి కట్టిపడేశాడు. ఓ వ్యక్తిపై అపరిమితమైన ప్రేమను చూపించే సగటు పల్లెటూరి యువకుడిగా అతడు నటించిన విధానం మెప్పిస్తుంది. కార్తీ కెరీర్‌లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అరవిందస్వామి భార్యగా దేవదర్శిని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకూ కమెడియన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేసిన ఆమె ఎంతో డెప్త్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేయగలనని ఈ సినిమాతో నిరూపించింది. శ్రీదివ్య, రాజ్ కిరణ్, జయప్రకాశ్‌ల పాత్రలు చిన్నవే అయినా కథపై ఎంతో ప్రభావం చూపాయి. మిగిలిన పాత్రలు దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
మనిషి సుఖంగా బ్రతకడానికి డబ్బు, పేరుతో పాటు మన మంచి కోరుకునే ఓ వ్యక్తి కూడా ఎంతో అవసరమని ఈ చిత్రం ద్వారా దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ చెప్పే ప్రయత్నం చేశారు. సత్యం ఊరిని వదిలి వెళ్లిపోవడానికి వెనకున్న కారణాన్ని చూపిస్తూ సినిమా ఆసక్తికరంగా మెుదలు పెట్టారు. ఓ పెళ్లికోసం సత్యం తిరిగి ఊరికి రావడం, అక్కడ కార్తి పాత్ర పరిచయం, అతడి అల్లరి, కార్తీ ఎవరో గుర్తురాక సత్యం పడే ఇబ్బందులు ఇలా అన్నీ సరదాగా అనిపిస్తాయి. ద్వితియార్థాన్ని కార్తీ ఇంటికి షిప్ఠ్ చేసిన దర్శకుడు అక్కడ సత్యానికి ఎదురయ్యే అనుభవాలను మనసుకు హత్తుకునేలా చూపించారు. ప్రేక్షకుల్ని వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక కార్తి పాత్ర పేరు గుర్తురాక సత్యం పడే మానసిక సంఘర్షణ మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక అందమైన నవలలా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కమర్షియల్ హంగులు లేకపోవడం, కథ నెమ్మదిగా సాగడం మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే నేపథ్య సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాగ్రౌండ్‌లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, భావోద్వేగాలు
- కార్తి, అరవింద స్వామి నటన
- సంగీతం
మైనస్ పాయింట్స్
- నెమ్మదిగా సాగే కథ
- కమర్షియల్ హంగులు లేకపోవడం
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?