• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Suryakumar Yadav: స్వప్నించి.. శ్రమించి.. సాధించిన ఆటగాడు.. మిస్టర్ 360 

    అది 2019 ఐపీఎల్ సీజన్. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టులో ఓ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దుమ్ము రేపుతున్నాడు. అతడి ఆటతీరు చూస్తుంటే.. వరల్డ్‌కప్‌కు టీమిండియాలో చోటు పక్కా అనే మాటలు వినిపించాయి. అతడే సూర్యకుమార్ యాదవ్. ఇదే ఊపును కొనసాగిస్తూ.. ముంబై జట్టు టైటిల్ గెలవడంలో SKY కీ రోల్ పోషించాడు. టీమిండియా జట్టు ప్రకటన రానే వచ్చింది. కానీ, అందరూ అనుకున్నట్లుగా సూర్యకి జట్టులో చోటు దక్కలేదు. టీమిండియాకు ఆడాలన్న కల.. ఆరోజుకి కలగానే మిగిలిపోయింది. కట్ చేస్తే.. 2022లో భారత్ తరఫున SKY అదరగొడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. 

    చెమటోడ్చినా.. దక్కని ఫలితం

    2010-11లో రంజీల్లోకి మహారాష్ట్ర తరఫున సూర్య కుమార్ యాదవ్ అరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ముంబై ఫ్రాంఛైజీ దృష్టిని ఆకర్షించాడు. దీంతో 2011లోనే ముంబై తరఫున ఐపీఎల్ కాంట్రాక్టు పొందాడు. 2013వరకు జట్టులోనే కొనసాగిన సూర్య.. ఆ తర్వాత కోల్‌కతాకు మారాడు. అక్కడ SKY దశ తిరిగింది. మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయసాగాడు. 2014లో కోల్‌కతా టైటిల్ గెలిచింది. ఇలా రెండు, మూడు సీజన్లు అయ్యాక.. తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. 2018లో 512 పరుగులు చేశాడు. 2019, 20ల్లో ముంబై టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. విభిన్నమైన షాట్లతో అలరించేవాడు. కానీ ఎంతోకాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న అతడి కల మాత్రం నెరవేరలేదు. 

    తలుపులు తెరుచుకోకపోతే.. బద్దలు కొట్టు

    ఎంత కష్టపడినా టీమిండియాలో చోటు దక్కకపోవడం సూర్యకుమార్‌ని నైరాశ్యానికి గురిచేసింది. దీంతో చాలా కుంగిపోయాడు. ఆ సమయంలో కుటుంబం ఇచ్చిన మద్దతు తానెప్పటికీ మరిచిపోలేనని SKY చెబుతుంటాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని కూడా ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాడు. ‘టీమిండియా సెలక్షన్ తలుపులు తెరుచుకోకపోతే.. నీ ప్రదర్శనతో అవి తెరుచుకునేదాకా తలుపు కొడుతూనే ఉండు. అసాధారణ ఆటతీరుతో ఆ తలుపులను బద్దలు కొట్టు’ అని జట్టులో చోటు దక్కని సమయంలో రోహిత్ ఇలా తనలో స్ఫూర్తి నింపేవాడని చెబుతుంటాడు.  

    చీకట్లను చీల్చిన ‘సూర్య’కిరణం

    2019,20లో ఐపీఎల్‌లో ముంబై తరఫున మంచి ప్రదర్శన చేసిన సూర్యకు ఎట్టకేలకు టీమిండియా నుంచి పిలుపొచ్చింది. 2021 మార్చిలో ఇంగ్లాండ్ సిరీస్‌కి ఎంపికై టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది శ్రీలంకతో తన మొదటి వన్డే మ్యాచ్‌ని ఆడాడు. అప్పటినుంచి ఇక సూర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. విలక్షణ షాట్లతో, నిలకడైన ఆట తీరుతో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. టీమిండియాను ఎప్పటినుంచో వేధిస్తున్న నం.4 స్థానానికి తనే పరిష్కారమై నిలిచాడు. అటు వన్డేలు, ఇటు టీ20ల్లో రాణిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సెంచరీ చేసి విమర్శకుల నోటికి తాళాలేశాడు. 

    Batting Career Summary(as on 29.09.2022)

    M Inn NO Runs HS Avg BF SR 100 200 50 4s 6s

    ODI 13 12 2 340 64 34.0 344 98.84 0 0 2 38 3

    T20I 32 30 5 976 117 39.04 563 173.36 1 0 8 88 57

    IPL 123 108 20 2644 82 30.05 1933 136.78 0 0 16 284 84

    (Table source: Cricbuzz)

    రికార్డులను తిరగరాసిన మిస్టర్ 360

    మైదానం నలువైపులా షాట్లను ఆడటం సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా ఆడుతూ టీమిండియా మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్నాడు. విభిన్న వ్యక్తిత్వంతో తన ఆటను కొనసాగిస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అమాంతంగా పైకి ఎదిగాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకులో నిల్చొన్నాడు. T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 45 సిక్సర్లు బాది వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు(732) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు నెం.1 స్థానం వేటలో పడ్డాడు.

    టార్గెట్ వరల్డ్‌కప్

    టీమిండియాకు వరల్డ్ కప్ అందించడమే తన లక్ష్యమని ఈ క్రికెటర్ చెబుతున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటానని తన మనసులో మాట బయటపెట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv