ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల కన్నుమూశారు. విప్లవానికి కళం, గళం తోడైతే అది గద్దర్‌లా ఉంటుంది. గద్దరన్న ఎన్నో పాటలతో జాతిని జాగృతం చేశాడు. ఆయన చూపించిన విప్లవ పంథా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గద్దరన్నతో పాటు ఎంతో మంది విప్లవ కళాకారులు ప్రజలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. పాట, ఆట రూపంలో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన వారున్నారు. మరి, ఆ కళాకారులు ఎవరో తెలుసుకుందాం.
ఎపూరు సోమన్న
అయోధ్య అంటే గుర్తొస్తడు రామన్న. పల్లె పాట అంటే యాదికొస్తడు ఏపూరు సోమన్న. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం వెలిశాలలో జన్మించాడు ఏపూరు సోమన్న. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నానమ్మ సంరక్షణలో పెరిగాడు. సోమన్న పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఏ పాట పాడినా అది శ్రోతలను ఆకట్టుకుంటుంది. పాటే తన జీవితంగా బతుకుతున్నాడు. ‘జోరు సాగుతుందిరా కొడకా.. తెలంగాణ హోరు సాగుతుందిరా’, ‘ఎవడిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ?’ అంటూ రాగమెత్తితే ఉద్యమ స్ఫూర్తి రగలాల్సిందే.
గోరేటి వెంకన్న
గోరేటి వెంకన్న కవి, గాయకుడు. ప్రస్తుతమున్న నాగర్ కర్నూల్ జిల్లా గౌరారంలో జన్మించాడు గోరేటి వెంకన్న. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ తెలంగాణ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాడు. వివిధ సినిమాల్లో పాటలు రాసి కుబుసం సినిమాలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ప్రస్తుతం వెంకన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
రసమయి బాలకిషన్
గజ్జె కట్టి, మైకు పట్టి.. గొంతెత్తి కాలు కదిపిన రసమయి బాలకిషన్ విప్లవ కళాకారుడే. రసమయి సిద్దిపేట జిల్లాలోని రావురూకులలో జన్మించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. ‘తెలంగాణ ధూం ధాం’ కార్యక్రమానికి పురుడు పోసింది రసమయినే. ‘ఓ యమ్మ నా పల్లె సీమ.. ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా?’ అంటూ ఎన్నో పాటలకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ప్రజలను ఏకం చేశాడు.
Oyamma Telangana- Rasamayi Balakishan Telangana Song || Folk Song Telugu || Folk songs
ఆర్.నారాయణమూర్తి
సామాజిక కళాకారుడిగా ఆర్ నారాయణ మూర్తి అందరికీ సుపరిచితం. క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగిత, సామాజిక సమస్యలపై తన గళం విప్పిన వ్యక్తి. తన సినిమాలతో వివిధ అంశాలను స్పృశిస్తూ ప్రజలను మేల్కొలిపాడు. అందుకే ఈయణ్ను పీపుల్స్ స్టార్ అని పిలుస్తుంటారు. నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించాడు. ఎన్నో సినిమాలను తీశాడు. ‘బంజారే బంజో’, ‘ఆపుర రిక్షోడా’, ‘ఎర్ర జెండ.. ఎర్ర జెండ’ వంటి పాటలతో పోరాట స్ఫూర్తిని రగిల్చాడు.
విమలక్క
భువనగిరి జిల్లా ఆలేరులో జన్మించింది విమలక్క. తెలంగాణను జాగృతం చేసే ఎన్నో పాటలను పాడింది. ‘అసైదులా హారతి’, ‘పల్లె పల్లెనా’, ‘ఏడు గడిసి పాయె.. దినము ఒడిసి పాయె’ వంటి పాటలను పాడి ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. మానవ హక్కుల సంరక్షణకు కదం తొక్కారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కళాకారులతో కలిసి కార్యక్రమాలను నిర్వహించినందుకు నాలుగు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించింది.
బెళ్లి లలిత
‘తెలంగాణ గాన కోకిల’గా బిరుదు పొందిన బెళ్లి లలిత ఉద్యమ కళాకారిణి. అణచివేతకు, అధికారానికి వ్యతిరేకంగా గొంతెత్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వనిత. తెలంగాణ కళా సమితి వ్యవస్థాపకురాలు. నాడు ఈమె ఎలుగెత్తిన తీరుకు అధికార నేతలే హడలిపోయారు. ప్రజలను సంఘటితం చేయడాన్ని చూసి వణికిపోయారు. సకల చెడులు, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. అయితే, పుట్టిన భువనగిరిలోనే లలితక్కను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి 18 ముక్కులుగా నరికేశారు. ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి.
పయిలం సంతోష్
తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా పనిచేశాడు పయిలం సంతోష్. సంతోష్ అసలు పేరు అడూరి బ్రహ్మయ్య. జానపద కళాకారుడు. ఉద్యమ సమయంలో గొంతెత్తి ప్రజలను సంఘటితం చేశాడు. తెలంగాణ నుంచి బొంబాయికి వలస పోతున్న ప్రజలను ఉద్దేశించి సంతోష్ ‘పైలం’ అనే ఆల్బమ్ విడుదల చేశాడు. అప్పటి నుంచి పైలం సంతోష్‌గా పేరుపొందాడు. సూర్యాపేట వెలిదండలో పుట్టిన సంతోష్.. నల్గొండలోని దుగునెల్లిలో పెరిగాడు. 2020లో అకాల మరణం పొందాడు.
సాయిచంద్
తెలంగాణ ఉద్యమ సమయంలో గొంతుకు సానబెట్టిన కళాకారుడు సాయిచంద్. వనపర్తి జిల్లాలోని అమరచింతలో జన్మించిన సాయిచంద్ ఎంతో చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం, అధికార పార్టీకి పనిచేశాడు. చనిపోయేంత వరకు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నాడు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్