నటీనటులు: నందు, తేజస్వి మదివాడ, ప్రియా ఆనంద్, అశుతోష్ రానా, పావని రెడ్డి, కేశవ్ దీపక్, సుధా, భానుచందర్ తదితరులు
డైరెక్టర్: అనిష్ కురువిల్లా
సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్
సంగీతం : శక్తికాంత్ కార్తిక్
ఎడిటింగ్: ఉమైర్ హాసన్, ఫయాజ్ రాయ్
నిర్మాతలు: గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట
ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్
అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island Review). నటుడు అనిష్ కురువిల్లా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు రూ.24 వేల కోట్లు. చనిపోవడానికి ముందే ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని విశ్వక్ వీలునామా రాస్తాడు. అయితే ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్‌లో వారం రోజులపాటు ఉండాలని షరతు విధిస్తాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులు మోక్ష ఐలాండ్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరిగా చనిపోవడం జరుగుతుంది. అసలు మోక్ష ఐలాండ్ మిస్టరీ ఏంటి? అక్కడ వారం రోజులు ఉండాలని విశ్వక్ ఎందుకు నిబంధన విధించాడు? వెళ్లిన వారు విశ్వక్ కుటుంబ సభ్యులేనా? కాదా? విశ్వక్‌కు మోక్ష ఐలాండ్‌కు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
ఈ వెబ్‌సిరీస్‌లో (The Mystery of Moksha Island Review) చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వారిలో ప్రియా ఆనంద్, నందు, అశుతోష్ రానా ఆకట్టుకుంటాయి. ఐలాండ్ మిస్టరీ ఛేదించేందుకు తాపత్రయపడే యువకుడిగా నందు తన పాత్రకు న్యాయం చేశాడు. కన్నింగ్ సైంటిస్ట్ పాత్రకు అశుతోష్ రానా వందశాతం న్యాయం చేశాడు. తేజస్వి మదివాడ, అక్షర గౌడ నటనతో కంటే తమ గ్లామర్‌తోనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల గే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. భానుచందర్, సోనియా అగర్వాల్, అజయ్ కతుర్వార్, సత్యకృష్ణతో పాటు మిగిలిన వారు తమ నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అనిష్ కురువిల్లా ఐలాండ్ నేపథ్యంలో రాసుకున్న మిస్టరీ స్టోరీ బాగుంది. మాస్, క్లాస్ ఇలా విభిన్న నేపథ్యాలతో సిరీస్‌లోని ప్రతీ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ తెలియని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని ఎవరు హత్యలు చేస్తున్నారు? ఒకరిని మరికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వరకు ఐలాండ్ గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తూ వీక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులను ఒక్కొక్కొటిగా విప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే లెక్కకు మించి పాత్రలు స్క్రీన్‌పై కనిపించడం గందరగోళానికి గురిచేస్తుంది. రొమాంటిక్, బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. క్లైమాక్స్ అంత సంతృప్తిగా అనిపించదు. అయితే థ్రిల్లర్ జానర్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. బీచ్ ఎపిసోడ్స్‌ను బాగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా మంచి పనితీరు కనబరిచింది. ల్యాబ్ సెటప్ సహజంగా అనిపిస్తుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- ఆసక్తికర కథనం
- ట్విస్టులు
మైనస్ పాయింట్స్
- బోల్డ్ కంటెంట్
- లెక్కకు మించిన పాత్రలు