క్రికెట్ ప్రపంచంలో నేడు వెలుగులీనుతున్న భారత్.. వినాయక చవితి రోజున ఓ మరపురాని విజయాన్ని సాధించిందంటే మీరు నమ్మగలరా..! అవును.. ఆదిదేవుడి తిథి రోజునే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారత జట్టు చరిత్రను తిరగరాసింది. వినాయకుడికి సిరీస్ విజయాన్ని ఉండ్రాళ్ల ప్రసాదంగా అందజేసింది. అయితే, ఇందులో వినాయకుడి కృప కూడా ఉందని విశ్వసిస్తుంటారు. గజరాజు రూపంలో ప్రత్యక్షమై.. జట్టును దీవించినట్లుగా భావిస్తుంటారు. మరి ఆ సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందామా..! పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ YouSay అందిస్తున్న ఈ కథనం మీకోసం.
అది 1971. మూడు టెస్టుల సిరీస్ కోసమని ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లింది. అప్పటి ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి.. నిండైన ఆత్మవిశ్వాసంతో బ్రిటీష్ గడ్డపై అడుగుపెట్టింది. కానీ, ప్రత్యర్థి జట్టు సామాన్యమైంది కాదు. పైగా వారి సొంత గడ్డపై నిలదొక్కుకోవడం అంటే కత్తిమీద సామే. విజయం దక్కాలంటే చెమటోడ్చాల్సిందే. తీవ్రమైన ఒత్తిడి.. బలమైన ఆత్మవిశ్వాసాల నడుమ భారత జట్టు తొలి సమరానికి సిద్ధమైంది.
ఆతిథ్య జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన మొదటి టెస్టును అతి కష్టం మీద భారత్ డ్రా చేసుకుంది. రెండో టెస్టు మాంచెస్టర్ లో మొదలయింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్లను నమోదు చేసింది. 410 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కు నిర్దేశించినప్పటికీ.. ఆటకు ఎక్కువ సమయం లేకపోవడం భారత్‌కు కలిసొచ్చింది. దీంతో ఈ టెస్టును ఇంగ్లాండ్ చేజేతులా డ్రా చేసుకుంది.
వెస్టిండీస్‌పై విజయంలో భారత్‌కు అదృష్టం కలిసొచ్చిందని కొందరు విమర్శించారు. ఇంగ్లాండ్ చేతిలో భారత్ చిత్తయిపోతుందని వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ భారత్ రెండు టెస్టులనూ డ్రాగా ముగించింది. తన ప్రదర్శనతో విమర్శకులు నీళ్లు నమిలేలా చేసింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టెస్టుకు ‘ఓవల్’ వేదికైంది.
ద డిసైడర్..
చివరిదైన మూడో టెస్టులోనూ ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. 355 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. భారత్ కూడా తొలి ఇన్నింగ్స్ లో పోరాట పటిమను కనబరిచింది. కానీ 284 పరుగులకే ఆలౌటైంది. 71 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ని ఆతిథ్య జట్టు గర్వంగా మొదలు పెట్టింది. ఇంతలో భారత్ అనూహ్యంగా పుంజుకుంది. 101 పరుగులకే ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చింది. జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతంగా రాణించాడు. ఆరు వికెట్లు పడగొట్టి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 173 పరుగుల లక్ష్య ఛేదనతో భారత్ రెండో ఇన్నింగ్స్ ను నాలుగో రోజు కొనసాగించింది. ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. కెప్టెన్ వాడేకర్ 45 పరుగులతో అజేయంగా క్రీజులో నిలిచాడు.
అజిత్ వాడేకర్‌తో మహ్మద్ అజారుద్దీన్
తెల్లారితే వినాయకచవితి. ఆటలో ఐదో రోజు. చివరి రోజున ఆత్మవిశ్వాసంతో కెప్టెన్ వాడేకర్ క్రీజులోకి వచ్చాడు. కానీ దురదృష్టం వెంటాడింది. వచ్చీరాగానే రనౌటయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే భారత్ మరో రెండు కీలక వికెట్లను కోల్పోయింది.దీంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. జట్టు సభ్యులంతా మునివేళ్లపై నిల్చొని మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. ఇంతలో మైదానం పరిసరాల్లో బెల్లా అనే ఏనుగు ప్రత్యక్షమైంది. స్థానిక మహిళ ఆ ఏనుగును అటువైపుగా తీసుకెళ్తోంది. అటుగా చూసిన సభ్యులు.. ఇది శుభశకునం అని భావించారు. చవితి రోజున స్వయంగా విఘ్నేషుడే తమ విఘ్నాలను తొలగించేందుకు వచ్చి విజయీభవ అని ఆశీర్వదించాడని వారు విశ్వసించారు. ఈ క్రమంలో మిడిలార్డర్‌ని ఆదుకుంటూ వస్తున్న ఫరోక్ ఇంజనీర్, సర్దేశాయ్, విశ్వనాథ్‌లు క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 1-0తో ఇంగ్లాండ్ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని భారత్ నమోదు చేసి కీర్తి పతాకాన్ని ఎగరవేసింది.
ఈ విజయాన్ని బ్రిటీష్ ఇండియా స్పోర్ట్స్ జర్నలిస్ట్, రచయిత మిహిర్ బోస్ తన పుస్తకమైన ‘A History of Indian Cricket’లో ప్రత్యేకంగా పొందుపరిచారు. మొదటి చాప్టర్ గా ‘The Day the Elephant Came to The Oval’ టైటిల్ తో విశదీకరించారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం