అజిత్ హీరోగా దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించిన చిత్రం వలిమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అజిత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. మరోవైపు ఈ సినిమాలో తెలుగు హీరో కార్తికేయ విలన్ పాత్ర పోషించడంతో మరింత ఆసక్తి పెరిగింది. హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? కథేంటి తెలుసుకుందాం..
సైతాన్ స్లేవ్స్ అనే బైక్ రేసింగ్ గ్యాంగ్ లీడర్ నరేన్(కార్తికేయ). కొలంబియా నుంచి ఒడిషా వచ్చిన డ్రగ్స్‌ను వైజాగ్‌లో యూత్‌కి విక్రయించి వారితో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు వాడుకుంటాడు. ఇలా ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకుంటాడు. ఇలా నగరంలో రోజురోజుకు పెరుగుతున్న దోపిడీలు, హత్యలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏసీపీ అర్జున్‌ను(అజిత్) రంగంలోకి దించుతుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. బైక్ రేసర్ అయిన అర్జున్, ఆ బైక్ రేసింగ్ ముఠాను ఎలా పట్టుకున్నాడు. వాళ్ల అక్రమాలకు ఎలా అడ్డుకట్ట వేశాడనేదే ఈ సినిమా కథ. ఆ ముఠాను పట్టుకునేందుకు సోఫియా (హ్యుమా ఖురేషి) అర్జున్‌కు సాయపడుతుంది. ఇంతకు మూవీలో ఆమె పాత్ర ఏంటి? ఎవరెలా నటించారు? స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
అజిత్ రియల్ లైఫ్‌లో కూడా బైక్ రేసర్ కావడంతో అది ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అయితే ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దిన దర్శకుడు సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు జోడించాడు. ఇక అజిత్ ఫ్యామిలీ సెంటిమెంట్ అతికించినట్లుగానే ఉంటుంది. కథకు ఏమాత్రం తోడ్పడదు. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు, బైక్ ఛేజింగ్ సీన్లపై ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. వాటిని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అయితే కథ ఆరంభంలో కలిగించే ఇంట్రెస్ట్‌ను చివరివరకు కొనసాగించలేకపోయారు.
కార్తికేయ తన పాత్రలో ఒదిగిపోయాడు. గ్యాంగ్ లీడర్ తర్వాత విలన్‌గా నటించిన రెండో సినిమా ఇది. అజిత్‌తో సినిమా అనగానే దానికి తగిన ప్రయత్నం చేశాడు. అజిత్‌తో పోటీపడి మరి నటించాడు. సినిమా కోసం తనను తాను మలుచుకున్న విధానం ముచ్చటేస్తుంది. అయితే కథా నేపథ్యం బాగున్నప్పటికీ రొటీన్ స్క్రీన్‌ప్లే, ఫ్యామిలీ డ్రామా కొంత విసుగు తెప్పిస్తాయి. సోఫియాగా హ్యుమా ఖురేషి పాత్రకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. మంచి కథ ఎంచుకున్నప్పటికీ దాన్ని వెండితెరపై చూపించడంలో విఫలమయ్యాడు దర్శకుడు వినోద్.
అజిత్ ఫ్యాన్స్‌కు మాత్రం సినిమా నచ్చుతుంది. ఆయన బైక్ ఛేజింగ్ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బోనీ కపూర్ సినిమా నిర్మాణంలో ఏ మాత్రం వెనుకాడలేదు. యాక్షన్ ఎపిసోడ్‌లలో జిబ్రాన్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
రేటింగ్: 2.5/5