‘ఛ.. బుమ్రా ఉంటే బాగుండేది. బుమ్రా అయితే పరుగులను కట్టడి చేసేవాడు. బుమ్రా అయితే వికెట్ తీసేవాడు’ ఆస్ట్రేలియాతో తొలి T20 మ్యాచ్ చూస్తుండగా ఇలాంటి భావనే అందరికీ కలిగింది. భారత బౌలర్ల ప్రదర్శన అలా ఉంది మరి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన బౌలర్లు చేతులెత్తేస్తుంటే అందరికీ బుమ్రానే గుర్తుకొచ్చాడు. ఆసియాకప్‌లోనూ బుమ్రా ఉంటే మరోలా ఉండేదేమో? నిజంగా బుమ్రా అంత ప్రభావం చూపగలడా..? అతడిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
జస్ప్రిత్ బుమ్రా.. భారత జట్టు బౌలింగ్ దళానికి వెన్నెముక. ఒక రకంగా చెప్పాలంటే బౌలర్లకు కెప్టెన్. తనే దళాన్ని ముందుండి నడిపిస్తాడు. కానీ గాయం కారణంగా జులైలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనే అర్ధంతరంగా వెనుదిరిగాడు. తన ఆటతీరుతో టీమిండియాకు ప్రధాన బౌలరయ్యాడు. మ్యాచ్ గతిని మార్చే సత్తా కలవాడు. అయితే, బుమ్రా ఎదగడానికి ముఖ్యంగా మూడు లక్షణాలు దోహదపడ్డాయి. అవేంటంటే..?
వైవిధ్యత..
ప్రతి బౌలర్‌కి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఆ శైలితోనే ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకున పెట్టేస్తారు. అలా బుమ్రాకు బౌలింగ్‌కు కూడా ప్రత్యేకమైన శైలి ఉంది. అందరిలా కాకుండా తాను విభిన్నంగా బంతులేస్తాడు. కుడి చేతికి, ఎడమ చేతికి మధ్య 90డిగ్రీల కోణం ఉండేలా చూసుకుని బాల్‌ని జారవిడుస్తాడు. ఇలా బౌలింగ్ శైలితో బ్యాటర్‌ని తికమక పెడుతుంటాడు. ముఖ్యంగా పరిస్థితులకు అనుగుణంగా బుమ్రా బంతులేయగలడు. పిచ్‌కు తగ్గట్టుగా తన బౌలింగ్ లెంత్ లో మార్పు చేసుకోగలడు. అవసరమైనప్పుడు వికెట్లను రాబట్టగలడు. ఈ వైవిధ్యతే బుమ్రాకు కలిసొచ్చింది.
డెత్ బౌలింగ్..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయగలడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ మధ్య, చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులు వేయగలడు. షార్ట్ పిచ్, స్లో, యార్కర్లు, వైడ్ యార్కర్లను సంధించగలడు. అత్యుత్తమ ఎకానమీతో తన స్పెల్‌ని ముగించగలడు. ఇప్పటివరకు 72 వన్డే మ్యాచుల్లో.. 121 వికెట్లు తీసి 4.64ఎకానమీతో ముందంజలో ఉన్నాడు. T20ల్లో కూడా మెరుగైన ఎకానమీతో దూసుకెళ్తున్నాడు. 58 మ్యాచుల్లో 6.46ఎకానమీతో కొనసాగుతున్నాడు. ఈ గణాంకాలే బుమ్రా ప్రదర్శనకు నిదర్శనం.
పదునైన పేస్
వేగంగా చాలా మంది బౌలర్లు బంతులు విసరగలరు. కానీ కచ్చితత్వంతో అంత వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. ఇది బుమ్రాకు సాధ్యమైంది. గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో అత్యంత కచ్చితత్వంతో బంతులు వేయగలడు. ఈ వేగాన్ని విశ్లేషించి.. బ్యాట్స్‌మన్ స్పందించేలోపే బంతి దూసుకెళ్తుంది. వికెట్లను గిరవాటేస్తుంది. అంతేకాకుండా, స్లో బంతులను కూడా బ్యాట్స్‌మన్‌లపై ప్రయోగించగలడు. బ్యాటర్‌ని అసహనానికి గురిచేసి.. వికెట్‌ను రాబట్టగలడు.
Bowling Career Summary
M | Inn | B | Runs | Wkts | BBI | BBM | Econ | Avg | SR | 5W | 10W | |
Test | 30 | 58 | 6268 | 2815 | 128 | 6/27 | 9/86 | 2.69 | 21.99 | 48.97 | 8 | 0 |
ODI | 72 | 72 | 3807 | 2941 | 121 | 6/19 | 6/19 | 4.64 | 24.31 | 31.46 | 2 | 0 |
T20I | 58 | 57 | 1247 | 1343 | 69 | 3/11 | 3/11 | 6.46 | 19.46 | 18.07 | 0 | 0 |
IPL | 120 | 120 | 2742 | 3380 | 145 | 5/10 | 5/10 | 7.4 | 23.31 | 18.91 | 1 | 0 |
(Table Source: Cricbuzz)
బుమ్రా లేమితో భారత బౌలింగ్ గతితప్పింది. అదృష్టవశాత్తు ఈ పేస్ బౌలర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రపంచకప్ బరిలో నిలిచాడు. గాయం నుంచి కోలుకుంటున్నాడు. కాస్త విశ్రాంతి తీసుకుంటే.. తిరిగి మైదానంలో చెలరేగిపోగలడు. మంచినే ఆశిద్దాం. బుమ్రా త్వరగా అడుగుపెట్టాలని కోరుకుందాం.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!