చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజాల్లో షియోమి ఒకటి. ఈ కంపెనీ రిలీజ్ చేసే అత్యాధునిక ప్రొడక్ట్స్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షియోమి మరిన్ని ప్రొడక్స్ట్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ‘రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్’ (Redmi Watch 3 Active) పేరుతో స్మార్ట్‌వాచ్, ‘స్మార్ట్ టీవీ ఎక్స్’ (Smart TV X) సిరీస్‌లో నాలుగు స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది. ఈ ప్రొడక్టుల ధరలు, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
Redmi Watch 3 Active
గతంలో తీసుకొచ్చిన రెడ్‌మీ వాచ్ 2 లైట్ (Redmi Watch 2 Lite) మోడల్‌లో కొన్ని మార్పులు చేసి రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్ (Redmi Watch 3 Activ) మోడల్‌ను షియోమి లాంఛ్ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచినట్లు షియోమి ప్రకటించింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
బేసిక్ ఫీచర్లు
రెడ్‌మీ వాచ్ 3 యాక్టివ్ (Redmi Watch 3 Activ)ను 450 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్‌తో 1.85 ఇంచ్‌ల భారీ LCD డిస్‌ప్లే తీసుకొచ్చారు. 60Hz రిఫ్రెష్ రేట్ కెపాసిటీని దీనికి అందించారు. ఒకసారి చార్జ్ చేస్తే 12 రోజుల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌కి ఇది కనెక్ట్ కాగలదు. బ్లూ టూత్ సాయంతో Mi Fitness యాప్‌కు యూజర్లు కనెక్ట్ అయ్యి, హెల్త్ ఫీచర్లు మానిటర్ చేసుకోవచ్చు. Redmi Watch 3 Activ ఏకంగా 200కు పైగా వాచ్ ఫేసెస్‌కు సపోర్ట్ చేస్తుంది.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర
SpO2 ట్రాకర్, స్టెప్ ట్రాకర్, 24/ 7 హార్ట్ రేట్ మానిటర్, స్ట్రెస్ క్యాలిక్యులేటర్, మహిళల కోసం పీరియడ్స్ ట్రాకర్, బ్లూటూత్ కాల్ కనెక్టివిటీ, SOS కాల్స్ ఆప్షన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు Redmi Watch 3 Activలో ఉన్నాయి. బ్యాటరీ ప్యాకేజీలో ఒక మ్యాగ్నటిక్ ఛార్జింగ్ కేబుల్ మాత్రమే వస్తుంది. అడాప్టర్ ఉండదు. 100 నిమిషాల్లోనే వాచ్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీని ధరను రూ.2,999గా నిర్ణయించారు. ఆగస్టు 3 (గురువారం) నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
Xiaomi Smart TV X-series
షియోమి లాంఛ్ చేసిన స్మార్ట్ టీవీలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన షియోమి స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ (Xiaomi Smart TV X-series)పై అందరి దృష్టి పడింది. నాలుగు మోడళ్లలో ఈ సిరీస్ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? అని టెక్ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టీవీ ఫీచర్లు
Xiaomi Smart TV X-seriesలోని టీవీల్లో డిస్‌ప్లే సైజు మినహాయిస్తే మిగతా ఫీచర్లన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. 3840×2160 రిజల్యూషన్‌తో డాల్బీ విజన్(Dolby Vision)కు ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కోర్ చిప్‌సెట్, గూగుల్ టీవీ ఓఎస్‌తో టీవీలు రన్ అవుతాయి. సౌండ్ విషయానికొస్తే, 30 వాట్ల వరకు అవుట్‌పుట్ డెలివర్ చేయగలదు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, రెండు USB-A పోర్టులు, మూడు HDMI పోర్టులు ఉన్నాయి. కంటెంట్‌ను ట్యూన్ చేయడానికి ‘Vivid Picture Engine’ని ఈ స్మార్ట్ టీవీ ఉపయోగిస్తుంది.
ధర ఎంతంటే?
Xiaomi Smart TV X-series స్మార్ట్‌టీవీలు 43, 50, 55, 65 అంగుళాల స్క్రీన్ వేరియంట్స్‌తో ఇవి మార్కెట్‌లోకి వచ్చాయి. బ్యాంక్ ఆఫర్లతో కలిపి 43 అంగుళాల స్మార్ట్‌టీవీ ధర రూ.26,999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.32,999గా ఉంది. అలాగే 55 అంగుళాల టీవీకి రూ.37,499, 65 అంగుళాల స్మార్ట్ టీవీకి రూ.58,999 చెల్లించాలి.