వృత్తిపరంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయినప్పటికీ అజయ్ గాంధీ గారి పేరు వినగానే మొదటి గుర్తొచ్చేది ఆయనకి సాహిత్యంపైన ఉన్న అపారమైన ప్రేమ.. దానిని కలకాలం కాపాడుకోవాలన్నతపన. ఒక మేధావిగా, మానవతావాదిగా, ఆశావాదిగా, ఆలోచనాత్మకంగా, ఉల్లాసంగా ఉండే తత్వవేత్తగా అజయ్ గాంధీని ఈరోజు ఆయన మరణ వార్త గురించి తెలుసుకున్న వారంతా గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ మహానగరంలో క్రికెట్, సినిమాలు, ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంక దేనికీ కూడా ప్రజల మద్దతు, అభిరుచి పొందేందుకు ఆస్కారం లేదు అనుకుంటున్న సమయంలో ఈయన విప్లవాత్మకంగా చేపట్టిన ఆలోచన రేకెత్తించే బహిరంగ ప్రసంగం ప్లాట్ ఫామ్ అద్భుతంగా వృద్ధి చెందింది. నగరంలో అసలు సాహిత్యం అనే పదాన్ని మరలా పుట్టించిన వ్యక్తి అజయ్ గాంధీ.
‘మన్థన్’ ప్రస్థానం ఇలా..!
2005లో అజయ్ గాంధీ, అతని మిత్రుడు ఎమ్. ఆర్ విక్రమ్ కలిసి నగరంలోని అన్నీ సామాజిక వర్గాల్లో ఒక శక్తివంతమైన బహిరంగ ప్రసంగం వేదికను ప్రవేశపెట్టారు. అందులో నాయకులు, ఒకేలాగా ఆలోచించే వారందరినీ పోగు చేసి వారితో టాక్ షోలు, చర్చలు (డిబేట్లు), అవతలి వారి ఆలోచనా విధానాన్ని మార్చుకునే దృక్పథం కలిగిన ప్రసంగాలను ప్రజలకు అందించారు. దీనినే ఇప్పుడు మనం ‘మన్థన్’ అని ఇప్పుడు పిలుస్తోంది. నిదానంగా నగరంలో ఉండే విద్యావంతులు, నాయకుల నుండి మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, రచయితలు, దౌత్యవేత్తలు,ఆర్ధికవేత్తలు, కళాకారులు సాంస్కృతిక నిపుణులకు ఎంతమందికి ఈ వేదిక ఆతిథ్యం ఇచ్చింది.
HLFతో మరింత గుర్తింపు
ఇక అతను ప్రవేశపెట్టిన ‘హెచ్ఎల్ఎఫ్’ (HLF – Hyderabad Literature Festival) హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌ను ఒక పండుగలాగే జరుపుకుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సాహిత్యానికి బహిరంగ ప్రదేశాలకు దక్కుతున్న ఆదరణ, పెరుగుతున్న సహకారంలో గాంధీకే ఎక్కువ భాగం క్రెడిట్ దక్కాలి. ‘మన్థన్’, ‘హెచ్ఎఫ్ఎల్’ కాకుండా వృత్తి పరంగా కూడా అతను కమలేష్ గాంధీ, మో గాంధీతో కలిసి వింగ్స్ ఇన్ఫోనెట్ (Wings Infonet) ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలను కూడా నిర్వహించారు. కానీ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ గానే అతని పాత్రకు అత్యంత గుర్తింపు దక్కింది.
అప్పుడు తెలీదు…
ఇప్పుడు సామాజిక, రాజకీయ చర్చా వేదికగా విస్తృతంగా పరిగణించబడుతున్న హైదరాబాద్‌లో అజయ్ గాంధీ తన స్నేహితుడు, తన మిత్రుడు విక్రమ్‌తో కలిసి అసలు ‘మన్ థన్’ ఫౌండేషన్‌ను ఎలా ప్రారంభించారో వివరించారు. తమకు ఆ ఆలోచన వచ్చినప్పుడు అది ఎంత పెద్దగా రూపుదిద్దుకుంటుంది అన్నది తాను గ్రహించి లేదని విక్రమ్ చెప్పారు.
అలాంటి వ్యక్తి ఒకసారి క్యాన్సర్‌ని కూడా జయించాడు. ఇక ఈ సారి కూడా అతను సులువుగానే ఈ గండం నుండి బయటపడతారు అని అందరూ అనుకున్నారు. కానీ 23 సెప్టెంబర్ న ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.
జైరాం రమేష్ మాటల్లో….
అజయ్ గాంధీ మరణ వార్తపై ప్రముఖ రాజకీయవేత్త జైరాం రమేష్ స్పందిస్తూ… ఈ ఏడాది జూన్‌లో తాను ‘మన్థన్’ లో ప్రసంగించినట్లు తెలిపారు. “16 సంవత్సరాల నా స్నేహితుడు అజయ్ గాంధీ సహనిర్వహణ హైదరాబాదులో చర్చలు సంభాషణ కోసం నిర్వహించిన అద్భుతమైన వేదిక ‘మన్ థన్’. అతనితో స్నేహం ఎప్పుడూ నాకు ప్రతిష్టాత్మకమైన అనుభవమే. ఈ మధ్యనే నా కొత్త పుస్తకం పై ఆన్లైన్లో అతనితో సంభాషించాను. ఆయన ఒక అసాధారణ పౌరుడు” అని ట్విట్టర్లో తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇలా ఎంతోమంది మన్ననలకి పాత్రుడిగా సాహిత్యానికి ముద్దుబిడ్డగా ఉన్న అజయ్ గాంధీ గారు ఈనాడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. అయితే అతను స్థాపించిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, మన్థన్ వంటి ఎన్నో గొప్ప వేదికలను చిరకాలం కాపాడుకోవడమే మనం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి.