భారత క్రికెట్లో సచిన్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న క్రికెటర్ ధోని. తన కెప్టెన్సీ నైపుణ్యంతో భారత్‌ను మూడు పర్యాయాలు ప్రపంచ విజేతగా నిలిపిన ఘనత ధోనికే దక్కుతుంది. అటువంటి ధోని భారత్ తరపున అన్ని ఫార్మెంట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ధోనిలో మునుపటి చురుకుదనం తగ్గిందని, వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నాడని ధోని వ్యతిరేక వర్గం విరుచుకుపడుతోంది. ఇక ఈ ఐపీఎల్ సీజనే ధోని క్రికెట్ కెరీర్‌కు ఆఖరిదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే వారి వ్యాఖ్యలను ధోని ఫ్యాన్స్ గట్టిగానే తిప్పుకొడుతున్నారు. ధోనిలో దూకుడు ఏమాత్రం తగ్గలేదని సమర్ధిస్తున్నారు.
అటు ధోనిపై క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎస్కే బ్యాటర్ కాన్వే, టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, రవిశాస్త్రి ఇలా ప్రతి ఒక్కరు ప్రస్తుత సీజన్లో ధోని ఆటతీరును మెచ్చుకుంటున్నారు. ధోని లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఊహించుకోలేమని చెబుతున్నారు. ఇటీవల RCBతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌ను ధోని అద్భుతంగా ఔట్ చేశాడు. చాలా ఎత్తుకు వెళ్లిన క్యాచులను అలవోకగా పట్టుకొని మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు. ధోని వికెట్ల వెనక ఉంటే తమకు ఎంతో ధైర్యంగా ఉంటుందని కాన్వే మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. అటు రవిశాస్త్రి సైతం ఐపీఎల్ ఎదుగుదలకు ధోని ఎంతో చేశాడని కొనియాడాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం ధోని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ధోని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన కెరీర్ ఇప్పుడు చివరి దశలో ఉందని ధోని వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. ‘ఇప్పటికే చాలామంది నా కెరీర్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎంతకాలం ఆడినా సరే.. ఇప్పుడు కెరీర్ చివరి దశలో ఉన్నాను. ఇప్పుడు దానిని ఎంజాయ్ చేస్తున్నా. వయసు పెరుగుతుందంటే మరింత అనుభవం వచ్చి చేరినట్లే. నేను ఎప్పుడూ వయసు పెరిగిపోతుందని చెప్పడానికి అస్సలు సిగ్గుపడను’ అని ధోని అన్నాడు. దీన్నిబట్టి చూస్తే ఇదే ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంకో 2-3 సీజన్లు ఆడేంత ఫిట్నెస్ ధోనికి ఉందని, తమ కోసం ఐపీఎల్ ఆడాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ ఐపీఎల్ విషయానికి వస్తే CSK ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ధోని తనదైన మార్క్ చూపిస్తున్నాడు. బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా అలవోకగా సిక్సులు, ఫోర్లు కొడుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. శుక్రవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని అద్భుతంగా కీపింగ్ చేశాడు. కళ్లు చెదిరే రీతిలో మయాంక్ అగర్వాల్‌ను స్టంపౌట్ చేశాడు. అటు చివరి ఓవర్లో వాషింగ్టన్ సుందర్‌ను ఔట్ చేసి తన కీపింగ్ స్కిల్స్ ఏమాత్రం తగ్గలేదని ధోని నిరూపించాడు. ఇదిలా ఉంటే ధోని సారథ్యంలోని ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన CSK నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఊపును కొనసాగించి ఈ ఏడాది టైటిల్ తమ ఖాతాలో వేసుకోవాలని చెన్నై ప్లేయర్లు భావిస్తున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది