UPSC సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఏకంగా మూడో ర్యాంకు కైవసం చేసుకొని రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారు. తొలి నాలుగు ర్యాంకులు సాధించిన మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె అయిన ఉమా హారతి పలు మార్లు విఫలమైనా ఐదో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. దీంతో ఉమా హారతిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ర్యాంకు సాధించడానికి గల కారణాలను ఉమా హారతి పంచుకున్నారు.
నాన్నే ప్రేరణ
హైదరాబాద్ ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన ఉమా హారతి.. తండ్రి ప్రోత్సహాంతోనే సివిల్స్ వైపు అడుగులు వేశారు. ప్రజలకు సేవ చేయడానికి అత్యుత్తమ వేదిక సివిల్స్ అని తన తండ్రి తొలి నుంచి చెబుతూ ఉండేవారని ఉమా అన్నారు. జీవితానికి ఓ అర్థం తీసుకొచ్చే చక్కటి వేదిక సివిల్స్ అని తనలో ప్రేరణ నింపారని చెప్పారు.
ఐదోసారి విజయం
సివిల్స్ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను చవి చూశారు ఉమా హారతి. తొలి నాలుగు అటెంప్ట్స్‌లో విఫలమైనా పట్టు విడవలేదు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత కష్టపడిన ఉమా తన ఐదో ప్రయత్నంలో ఏకంగా మూడో ర్యాంకు సాధించడం విశేషం.ఫెయిల్యూర్స్ వస్తుంటాయని, అంత మాత్రాన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదని ఉమా అన్నారు.
అస్సలు ఊహించలేదు
విజయానికి ఒకే ఫార్ములా లేదని ఏదైనా సాధించాలంటే పట్టుదల కీలకమని ఉమా హారతి అన్నారు.
తాను రోజూ ఏడెనిమిది గంటలు చదివినట్లు చెప్పారు. సివిల్స్ ఇంటర్యూకు హాజరైన సమయంలో ఏదోక ర్యాంక్ వస్తే చాలని భావించానన్నారు. మూడో ర్యాంకు వస్తుందని అసలు ఊహించలేదన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఎంత అవసరమో అంత చదివితే చాలని ఉమా సూచించారు. సివిల్స్‌కు హాజరయ్యే వారు అతిగా చదవవద్దని, అవసరమైనమేర చదివి ఎక్కువసార్లు సాధన చేయాలని సూచించారు.
ఏమోషనల్ సపోర్ట్ ముఖ్యం
తాను ఐదేళ్ల నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు ఉమా హారతి తెలిపారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఎమోషనల్ సపోర్టు తనను నిరూత్సాపడినివ్వలేదని పేర్కొన్నారు. పరీక్షలకు కావాల్సిన సమాచారం, బుక్స్ అన్నీ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తాయని కానీ, ఎమోషనల్, ఫ్యామిలీ సపోర్టు మాత్రం బయట దొరకదని అన్నారు. ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల మద్దతే ఎంతో అవసరమన్నారు. అది లభిస్తే పురుషులు, స్త్రీలు ఎవరైనా సివిల్స్ సాధించవచ్చని స్పష్టం చేశారు.
టాప్-25లో మహిళలే ఎక్కువ
2022 సివిల్స్ పరీక్షా ఫలితాల్లో మెుత్తం 933 మంది అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో 613 మంది మగవారు కాగా 320 మహిళలు ఉన్నారు. టాప్-25 సివిల్స్ ర్యాంకర్స్‌లో ఏకంగా 14 మంది మహిళలే ఉన్నారు. ఇక టాప్-4 ర్యాంక్స్ కూడా యువతులే కైవసం చేసుకున్నారు. కాగా, ఏటా జరిగే సివిల్ సర్వీసెస్ పరీక్షలను మూడు అంచెలుగా నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది