ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న పెద్ద ఎత్తున కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీలోకి వచ్చాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
వీరాంజనేయులు విహారయాత్ర
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ‘వీరాంజనేయులు విహార యాత్ర‘ (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ నటుడు నరేశ్ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్ మయూర్ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. ప్లాట్ ఏంటంటే ‘నాగేశ్వరరాలు (నరేశ్) మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం పోవడం, కూతురు పెళ్లి ఫిక్స్ కావడంతో అతడికి డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో తన తండ్రి వీరాంజనేయులు గోవాలో కొన్న ఇంటికి సంబంధించి రూ.60 లక్షల ఆఫర్ వస్తుంది. దీంతో ఇంటిని అమ్మేందుకు ఫ్యామిలీతో కలిసి గోవాకు బయల్దేరుతారు. ఈ ప్రయాణం నాగేశ్వరరావు ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపింది?’ అన్నది స్టోరీ.
మనోరథంగల్
మలయాళ స్టార్లు మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటించిన ఆంథాలజీ సిరీస్ ‘మనోరథంగల్’ (Manorathangal). ఆగస్టు 15 నుంచి జీ 5 వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ నాయర్ రాసిన కథల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. తొమ్మిది కథల సమాహారం ఇది. ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దారు. మలయాళ స్టార్ నటులు మోహన్‌లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) తదితరులు నటించడంతో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
పేక మేడలు
తెలుగు మూవీ ‘పేక మేడలు’ (Peka Medalu) థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చింది. క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15 నుంచి ఈటీవీ విన్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘లక్ష్మణ్, వరలక్ష్మి దంపతులు. మూసీ ఒడ్డున ఉన్న బస్తీలో నివసిస్తుంటారు. లక్ష్మణ్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ ఖాళీగా తిరుగుతుంటాడు. ప్లాట్స్ అమ్మి కోట్లు సంపాదిస్తానని గాల్లో మేడలు కడుతుంటాడు. ఈ క్రమంలో యూఎస్ నుంచి వచ్చిన శ్వేతకు డబ్బున్న వ్యక్తిగా లక్ష్మణ్ దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? లక్మణ్ నేర్చుకున్న గుణపాఠం ఏంటి?’ అన్నది స్టోరీ.
OMG
OMG (ఓ మంచి ఘోస్ట్) అనే కామెడీ హార్రర్ సినిమా ఆగస్టు 15 నుంచి ఓటీటీలోకి వచ్చింది. ఆహాలో ఈ మూవీని వీక్షించవచ్చు. ఇందులో వెన్నెల కిశోర్, షకలక శంకర్, నందిత శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని శంకర్ కె. మార్తాండ్ తెరకెక్కించారు. ప్లాట్ ఏంటంటే ‘చైతన్య అతని స్నేహితులకు డబ్బు అవసరం పడుతుంది. దీంతో ఎమ్మెల్యే కూతురు కీర్తిని కిడ్నాప్ చేస్తారు. ఓ బంగ్లాలో బందిస్తారు. అయితే అందులో ఓ దెయ్యం ఉంటుంది. దానికి కిడ్నాపర్లు అంటే అసలు పడదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బంగ్లా నుంచి వారు బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
డార్లింగ్
టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన ‘డార్లింగ్’ (Darling) చిత్రం ఆగస్టు 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాట్ స్టార్ వేదికగా ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘రాఘవ్ (ప్రియదర్శి) చిన్నప్పటి నుంచి పెళ్లి, హనీమూన్ అంటూ కలలు కంటాడు. భార్యను తీసుకొని హనీమూన్‌కు పారిస్ వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతడి లైఫ్‌లోకి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆనంది (నభా నటేష్) వస్తుంది. ఆమెతో రాఘవ్ ఎన్ని తిప్పలు పడ్డాడు?’ అన్నది కథ.
బ్లింక్
‘దసరా‘ సినిమాలో నాని పక్కన ఫ్రెండ్‌గా చేసి నటుడు దీక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అటువంటి దీక్షిత్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘బ్లింక్’ (Blink). సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘పీజీలో ఫెయిలైన అపూర్వ (దీక్షిత్ శెట్టి) పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో పడతాడు. తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ అపూర్వ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కనురెప్పల్ని మూయడం ద్వారా అతడు టైమ్ ట్రావెల్‌లో ముందుకు, వెనక్కి వెళ్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఏంటి?’ అన్నది స్టోరీ.
ఎవోల్
బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఎవోల్’ (EVOL) చిత్రం ఆగస్టు 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. యోగి వెలగపూడి దర్శకత్వం వహించిన ఈమూవీలో సూర్యశ్రీనివాస్, శివబొడ్డు రాజు, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్స్ చేశారు. లవ్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‍ను తిరగేసి రాస్తే వచ్చే ఎవోల్ టైటిల్‍తో ఈ మూవీ వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ఇద్దరు స్నేహితులతో ఓ అమ్మాయి ఒకేసారి ప్రేమలో పడుతుంది. వారికి శారీరకంగా దగ్గరవుతుంది. ఆయితే ఆ ఇద్దరిని ఆమె నిజంగానే ప్రేమించిందా? లేదా ట్రాప్ చేసిందా? ఈ లవ్ స్టోరీ చివరికీ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ.
మై పర్‌ఫెక్ట్ హస్బెండ్
తమిళ సీనియర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ‘మై పర్‌ఫెక్ట్ హస్బెండ్’ (My Perfect Husband). తమిర దర్శకత్వం వహించారు. ఆగస్టు 16 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ప్లాట్ ఏంటంటే ‘సత్యరాజ్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తుంటారు. భార్య రేఖ తన భర్త పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరని గర్వపడుతుంటుంది. అయితే సత్యరాజ్ బాల్యంలో ఓ అమ్మాయిని ఇష్టపడతారు. ఇన్నాళ్ల తర్వాత ఆమె సత్యరాజ్ లైఫ్‌లోకి వస్తుంది. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన రేఖ ఏం చేసింది? గతంలో ఏం జరిగింది?’ అన్నది స్టోరీ.