ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్ రిలీజ్ అవుతుండటంతో కొన్ని మూవీస్ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్ రేటెట్ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.
అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu)
నారా రోహిత్ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
కంచె (Kanche)
వరణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కంచె. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్ తేజ్).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya)
నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. మలయాళంలో విజయవంతమైన ‘మహేశ్ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ.
పలాస 1978 (Palasa 1978)
రక్షిత్ అట్లూరి హీరోగా కరుణ కుమార్ డైరెక్షన్ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
మను (Manu)
బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్ ఫండింగ్ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు. కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ.
వేదం (Vedam)
అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ.
చక్రవ్యూహం: ది ట్రాప్ (Chakravyuham: The Trap)
అజయ్ లీడ్ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్ (సుదీష్)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.
మెంటల్ మదిలో (Mental Madilo)
శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్, అమృత శ్రీనివాసన్ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.
రిపబ్లిక్ (Republic)
మెగా హీరో సాయిధరమ్ తేజ్, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘రిపబ్లిక్‘. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ.
క్షణం (Kshanam)
అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.