ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పేరు మార్మోమోగుతోంది. కోలీవుడ్‌కు చెందిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ ‘రఘువరన్ బీటెక్’, ‘విక్రమ్’, ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలతో యమా క్రేజ్ సంపాదించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఉందంటే ఆ మూవీకి ఎనలేని క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా యూత్ అనిరుధ్ ఇచ్చే పాటలు, నేపథ్య సంగీతానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్గా తారక్ నటించిన ‘దేవర’ చిత్రానికి సైతం అనిరుధ్ అదిరిపోయే సంగీతం ఇచ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకూ కోలీవుడ్‌పైనే ఫోకస్ ఉంచిన అనిరుధ్ ప్రస్తుతం దానిని టాలీవుడ్‌పైకి మరల్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇక్కడి మ్యూజిక్ డైరెక్టర్లకు కష్టాలు తప్పవన్న చర్చ మెుదలైంది.
ఆ చిత్రాలతో తెలుగులో క్రేజ్!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నేరుగా ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘యూటర్న్’ వంటి చిత్రాలు చేశాడు. ఆయా సినిమాల్లో మ్యూజిక్ పెద్ద హిట్ అయినప్పటికీ అనిరుధ్ గురించి టాలీవుడ్లో పెద్దగా చర్చ జరగలేదు. అయితే రీసెంట్గా ‘విక్రమ్’, ‘జైలర్’, ‘జవాన్’ చిత్రాలతో అతడి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. ముఖ్యంగా అతడిచ్చిన నేపథ్య సంగీతానికి యూత్ ఫిదా అయ్యారు. ఆయా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో అనిరుధ్ మ్యూజిక్‌ను తెలుగు ఆడియన్స్ సైతం బాగా ఎంజాయ్ చేశారు. రిపీట్ మోడ్‌లో అతడి పాటలు వింటూ సంగీతాన్ని అస్వాదించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ వల్లే అనిరుధ్ ‘దేవర’ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు కూడా మేకర్స్ ఇటీవల తెలియజేశారు.
టాలీవుడ్లో వరుస ఆఫర్లు!
‘దేవర’ సక్సెస్ తర్వాత టాలీవుడ్లో అనిరుధ్ పేరు బాగా వినిపిస్తోంది. మరోమారు థియేటర్లలో అతడి మ్యూజిక్ ఎంజాయ్ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన తెలుగు దర్శక నిర్మాతలు అనిరుధ్‌తో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటు తెలుగులో వస్తోన్న ఆదరణ చూసి టాలీవుడ్‌లోనూ తన దూకుడు పెంచాలని అనిరుధ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే విజయ్ దేవరకొండ, గౌతం తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాకు సైతం అనిరుధ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు డైరెక్టర్లు కూడా తమ మూవీ కోసం అనిరుధ్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్. రానున్న రోజుల్లో అరడజను ప్రాజెక్ట్స్ వరకూ తెలుగులో అనిరుధ్ చేయవచ్చని అంటున్నారు.
థమన్, దేవిశ్రీకి కష్టమేనా!
సంగీత దర్శకులు థమన్, దేవిశ్రీ ప్రసాద్ గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో రిలీజయ్యే 10 చిత్రాల్లో కనీసం 5-8 చిత్రాలకు వీరిద్దరే మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు డైరెక్టర్ల తొలి రెండు ప్రాధాన్యాలుగా వీరిద్దరే ఉంటూ వచ్చారు. అటువంటి థమన్, దేవిశ్రీకి అనిరుధ్ రాకతో గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న, మెున్నటి వరకూ టాలీవుడ్‌ను అంతగా ప్రాధాన్యత ఇవ్వని అనిరుధ్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడం వారికి గట్టి ఎదురుదెబ్బేనని అభిప్రాయపడుతున్నారు. మరి అనిరుధ్ మ్యానియాను తట్టుకొని థమన్, దేవిశ్రీ ఏవిధంగా రాణిస్తారో చూడాలని పేర్కొంటున్నారు.
అవి క్లిక్ అయితే ఆపడం కష్టం!
రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి జరగండి జరగండి, రా మచ్చా మచ్చా పాటలు రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి సైతం థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘హంగ్రీ చీతా’ రిలీజ్ చేసిన సాంగ్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తాజాగా బాలయ్య-బోయపాటి నాలుగో చిత్రం ‘అఖండ 2’కి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. మరోవైపు దేవిశ్రీ చేతిలో ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటికే రిలీజైన పుష్ప టైటిల్ సాంగ్‌తోపాటు ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆయా ప్రాజెక్ట్స్ సక్సెస్ అయితే థమన్, దేవిశ్రీకి తిరుగుండదని చెప్పవచ్చు.