ఓటీటీల్లో వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, సస్పెన్స్, పొలిటికల్ ఇలా వివిధ రకాల జానర్స్‌లో ఈ ఏడాది చాలా సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే సిరీస్ అనేది సినిమాలాగా రెండున్నర లేదా మూడు గంటల్లో అయిపోదు. ఎపిసోడ్‌కు గంట చొప్పున సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సిరీస్‌లకు 8 ఎపిసోడ్స్ ఉంటే మరికొన్నింటికి 10 ఉంటాయి. కాబట్టి అంత సమయం సిరీస్ కోసం వెచ్చించాలంటే అందులో సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలని ఆడియన్స్ భావిస్తుంటారు. సరిగ్గా అటువంటి సిరీస్‌లనే YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వచ్చిన వాటిలో ది బెస్ట్‌ను ఫిల్టర్ చేసి మరి అందిస్తోంది. ఈ సిరీస్‌లు మీకు తప్పక నచ్చుతాయి. వాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Contents
- 1 #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ (90’s – A Middle Class Biopic)
- 2 ఫాల్ ఔట్ (FallOut)
- 3 హీరామండి (Heeramandi)
- 4 లూటేర్ (Lootere)
- 5 పారాసైట్: ది గ్రే (Parasyte: The Grey)
- 6 పోచర్ (Poacher)
- 7 ఇన్‌స్పెక్టర్ రిషి (Inspector Rishi)
- 8 సేవ్ ది టైగర్స్ 2 (Save The Tigers)
- 9 మహారాణి సీజన్ 3 (Maharani Season 3)
- 10 ఇండియన్ పోలీస్ ఫోర్స్ (Indian Police Force)
- 11 తులసి వనం (Tulasivanam)
- 12 రెడ్ క్వీన్ (Red Queen)
- 13 చేరన్స్ జర్నీ (Cherans Journey)
- 14 మిస్టర్ & మిస్ స్మిత్ (Mr. & Mrs. Smith)
- 15 పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ (Perilloor Premier League)
- 16 క్యూబికల్స్ సీజన్ 3 (Cubicles Season 3)
#90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ (90’s – A Middle Class Biopic)
సీనియర్ నటుడు శివాజీ, వాసుకి ఆనంద్ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సిరీస్.. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వచ్చిన సిరీస్‌లలో టాప్ అని చెప్పవచ్చు. దీనికి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ప్రతీ ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ సిరీస్ కనెక్ట్ అవుతుంది. ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌లో ఉంది. కథ విషయానికి వస్తే.. చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఫాల్ ఔట్ (FallOut)
హాలీవుడ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ఇది పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. ఈ అమెరికన్ వెబ్ సిరీస్‌ను ఓ గేమ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తెరకెక్కించారు. 219 ఏళ్ల తర్వాత భూమిపై ఏం జరుగబోతుంది? అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్‌తో సిరీస్ దూసుకెళ్తోంది. ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే.. అణు విధ్వంసం ద్వారా సంభవించిన రేడియేషన్ నుంచి అమెరికా ప్రజలు తమను తాము ఎలా కాపాడుకున్నారు. అణు విస్పోటనం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవించాయి అన్నది ఈ వెబ్ సిరీస్ కథ.
హీరామండి (Heeramandi)
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ భన్సాలీ.. ‘హీరామండి’ సిరీస్ ద్వారా తొలిసారి ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఇందులో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి వంటి స్టార్ హీరోయిన్లు నటించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సిరీస్ టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే.. మల్లికాజాన్ (మనీషా కొయిరాల).. హీరామండిలో వేశ్యగృహాన్నినడుపుతూ ఆ ప్రాంతాన్ని శాసిస్తుంటుంది. అయితే ఆమెను దెబ్బకొట్టి ఆ ప్రాంతంపై పట్టు సాధించాలని ఫరీదన్ (సోనాక్షి సిన్హా) ప్రయత్నిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పోరులో ఎవరు విజయం సాధించారు? మల్లికాజాన్ కూతుర్లు అదితి రావ్ హైదరి, షార్మిన్ సేగల్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
లూటేర్ (Lootere)
హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన లూటెర్ సిరీస్.. ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. 2017లో చోటుచేసుకున్న యదార్థ సంఘటన ఆధారంగా ఈ సిరీస్‌ను జై మెహతా రూపొందించారు. దీపక్ తిజోరి, అవనీష్ పాండే ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే.. భారత దేశానికి చెందిన ఇండియన్ కార్గో షిప్‌ను సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు హైజాక్ చేస్తారు. దీంతో భారత సంతతి వ్యక్తి విక్రాంత్ గాంధీ ఆ సముద్రపు దొంగలతో జరిపిన చర్చలు ఏంటి? షిప్ కెప్టెన్ ఏకే సింగ్ సహా అందులోని సిబ్బంది పైరెట్స్ బారి నుంచి క్షేమంగా బయటపడ్డారా? లేదా? అన్నది కథ.
పారాసైట్: ది గ్రే (Parasyte: The Grey)
హార్రర్ అండ్ సైన్స్‌ఫిక్షన్ సిరీస్‌లను ఇష్టపడేవారు ‘పారాసైట్ : ది గ్రే’ తప్పక చూడాల్సిందే. ఈ కొరియన్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగులోనూ అందుబాటులో ఉంది. దర్శకుడు ఇయోన్ సంగ్ హో.. వీక్షకులను థ్రిల్ చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఆకాశం నుంచి కొన్ని పారాసైట్స్ భూమిపైకి వచ్చి మనుషుల అవయవాళ్లోకి ప్రవేశిస్తాయి. మెదడును కంట్రోల్ చేస్తాయి. పారాసైట్స్ వల్ల మానవుల రూపం మారిపోతుంది. ముఖ్యంగా మనుషుల తలలు చాలా వింతంగా మారిపోతాయి. అయితే ఈ పారాసైట్స్ వల్ల మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన ఎమర్జెన్సీ ఫోర్స్.. వీటిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేసింది అనేది కథ.
పోచర్ (Poacher)
సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాగా నచ్చిన వెబ్ సిరీస్ ‘పోచర్’. దర్శకుడు రిచీ మెహతా.. కేరళ అడవుల నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. నిమిషా సంజయన్, రోషన్ మ్యాథ్యూ, దిబియెందు భట్టాచార్య, కని కుస్రుతి ప్రధాన తారాగణంగా ఉన్నారు. స్టోరీ విషయానికి వస్తే.. కేరళ అడవుల్లో దంతాల కోసం 18 ఏనుగులను వేటగాళ్లు చంపేస్తారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మాలతో కలిసి నీల్ బెనర్జీ ఆధ్వర్యంలో ఓ టీమ్ వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. అడవిలో ఏనుగులను ఎవరు చంపుతున్నారు? దంతాల రవాణా ఎక్కడి నుంచి సాగుతోంది? ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తోంది ఎవరు? చివరికీ అతడ్ని ఎలా పట్టుకున్నారు? అన్నది కథ.
ఇన్‌స్పెక్టర్ రిషి (Inspector Rishi)
ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చిన మరో ఇంటస్ట్రింగ్ వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. నవీన్ చంద్రన్, సునైనా, శ్రీకష్ణ దయాళ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఓటీటీలోకి వచ్చిన కొత్తలో ఈ సిరీస్ దేశవ్యాప్తంగా టాప్‌లో ట్రెండింగ్ కావడం గమనార్హం. స్టోరీ విషయానికి వస్తే.. తేన్‌కాడ్ ఫారెస్ట్‌లో రాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ బాడీ చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. ఆ మృతదేహానికి సాలీడు గూడు కట్టి ఉండటం అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ కేసును చేధించడానికి ఇన్‌స్పెక్టర్ రిషి (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. గతంలో ఇలాగే చాలా మంది చనిపోయినట్లు దర్యాప్తులో తెలుసుకుంటాడు. ఈ కేసును రిషి ఎలా ఛేదించాడు? ఆ మరణాల వెనక అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్నది కథ.
సేవ్ ది టైగర్స్ 2 (Save The Tigers)
గతంలో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్‘కు సీక్వెల్‌గా ఇది వచ్చింది. అభినవ్ గోమఠం, ప్రియదర్శి, కృష్ణ చైతన్య ముఖ్య పాత్రలు పోషించారు. అరుణ్ కొత్తపల్లి దర్శకుడు. కడుపుబ్బా నవ్వుకునే సిరీస్ కావాలనుకునేవారు సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వీక్షించవచ్చు. కథ విషయానికి వస్తే.. హీరోయిన్ హంసలేఖ కనిపించకుండా పోతుంది. ఆమె కిడ్నాప్ వెనకాల ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం ఉన్నారని పోలీసులు అనుమానిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది?
మహారాణి సీజన్ 3 (Maharani Season 3)
మహారాణి వెబ్ సిరీస్‌కు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. పొలిటికల్ థ్రిల్లర్లను ఇష్టపడేవారి ఈ సిరీస్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ఇప్పటికే రెండు సీజన్లు రిలీజై సూపర్ హిట్ సాధించగా మూడోది కూడా ఈ ఏడాదిలో వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. సౌరభ్ భావే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో హూమా ఖురేషి లీడ్ రోల్‌లో చేసింది. ప్లాట్ విషయానికి వస్తే.. మహారాణి రెండో సీజన్ క్లైమాక్స్‌లో జైలుకు వెళ్లిన రాణీ భారతి.. తిరిగి బిహార్‌లో అడుగుపెడుతుంది. పోయిన అధికారం కోసం ఆమె ఏం చేసింది? తిరిగి పవర్‌ను ఛేజిక్కించుకుందా? లేదా? అన్నది కథ.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ (Indian Police Force)
ఉగ్రవాదం, పోలీసు ఇన్‌వెస్టిగేషన్ జానర్లను ఇష్టపడే వారికి ఇండియన్ పోలీసు ఫోర్స్ సిరీస్ మంచి థ్రిల్‌ను అందిస్తుంది. బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబరాయ్, శిల్పా శెట్టి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ సిరీస్‌ను దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించారు. సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. కథ విషయానికి వస్తే.. ఢిల్లీ నగరంలో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తాయి. ఈ దాడుల్లో దాదాపు 240 మంది చనిపోతారు. ఈ కేసును విచారించేందుకు సీపీ విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డీసీపీ కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్ర), తార (శిల్పాశెట్టి) రంగంలోకి దిగుతారు. ఇంతకీ ఈ పేలుళ్ల వెనక ఉన్నది ఎవరు? అందుకు కారణం ఏంటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? అన్నది కథ.
తులసి వనం (Tulasivanam)
ఒక యువకుడి ఇన్‌స్పిరేషన్ స్టోరీని చూడాలనుకుంటే ‘తులసి వనం’ చూడవచ్చు. సిద్దార్థ్ గొల్లపూడి హీరోగా అనిల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్.. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో మంచి వ్యూస్‌తో ముందుకెళ్తోంది. స్టోరీలోకి వెళ్తే.. తులసి అనే యువకుడు క్రికెట్‌లో ఉన్నత స్థితికి చేరాలని కలలు కంటాడు. ఇందులో రాణించేందుకు కష్టపడుతుంటాడు. ఈ ప్రయాణంలో కుటుంబ పరిస్థితులు అతడి కలలకు అడ్డంకిగా మారతాయి. మరి తులసి క్రికెట్‌లో ఉన్నతస్థాయికి చేరాడా? లేదా? తన జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నాడా? అన్నది కథ.
రెడ్ క్వీన్ (Red Queen)
హాలీవుడ్ యాక్షన్ డ్రామాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీరూ ఆ కోవకు చెందిన వారైతే ఈ సిరీస్ మీకు తప్పక నచ్చుతుంది. వికీ లుయెంగో ప్రధాన పాత్రలో చేసిన ఈ సిరీస్‌కు కోల్డో సెర్రా దర్శకత్వం వహించాడు. అమెజాన్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే.. ఓ తెలివైన మహిళకు యూరోపియన్ పోలీస్ ఫోర్స్‌కు నాయకత్వం వహించే అవకాశం కలుగుతుంది. అయితే ఈలోపల ఆమె ఇంట్లో మర్డర్ జరగడం, ఆమె వారసురాలు కిడ్నాప్ అవడం జరుగుతుంది. మరి వీటన్నింటి వెనుక ఉన్నది ఎవరు అనేది కథ.
చేరన్స్ జర్నీ (Cherans Journey)
తమిళంలో రూపొంది అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెబ్ సిరీస్ చేరెన్స్ జర్నీ. దర్శకుడు చేరన్ ఈ సిరీస్‌ను రూపొందించారు. శరత్‌కుమార్, ప్రసన్న, ఆరి అర్జునన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సోనీ లీవ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. అశోక్ కార్ల తయారీ కంపెనీ ఓనర్. కీలకమైన ఉద్యోగం కోసం ఇంటర్యూల ద్వారా వడబోస్తు ఐదుగురిని ఫైనల్ లిస్టులోకి తీసుకుంటారు. అందులో ఒకరిని ఎంపిక చేయడం కోసం అశోక్ ఏం చేశాడు? ఆ ఐదుగురు జీవితాలపై ఎలాంటి నిఘా పెట్టాడు? వారు పడుతున్న కష్టాలేంటి? చివరికీ ఉద్యోగంలోకి ఎవర్ని తీసుకున్నారు? అన్నది స్టోరీ.
మిస్టర్ & మిస్ స్మిత్ (Mr. & Mrs. Smith)
అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కూడా ఈ ఏడాది ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో బెస్ట్ అని చెప్పవచ్చు. డోనాల్డ్ గ్లోవర్, మాయ ఎర్స్కిన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. కరీనా ఎవాన్స్ దర్శకుడు. కథ ఏంటంటే.. ఇద్దరు భార్యభర్తలు గూఢాచారులుగా పనిచేస్తుంటారు.తమ మిషిన్ పూర్తయ్యే వరకు తమ వివాహాన్ని రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నటారు. అయితే వారికి ఒకరినొకరు చంపుకోవాల్సిన అసైన్‌మెంట్ అందించబడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ (Perilloor Premier League)
ఈ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. నిఖిలా విమల్ లీడ్ రోల్ చేసింది. కథ ఏంటంటే.. మాళవిక స్కూలు డేస్‌లో శ్రీకుంటన్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. పెద్దయ్యాక అతనిపైనే ఇష్టం పెంచుకుంటుంది. అనుకోకుండా ఆమె పెరిల్లూర్ అనే గ్రామానికి సర్పంచ్ అవుతుంది. అయితే శ్రీకుంటన్ మాళవికను కాదని డబ్బున్న అమ్మాయిలకు ఎర వేస్తుంటాడు. మరి చివరకు ఏమైంది? మాళవిక శ్రీకుంటన్‌ను పెళ్ళి చేసుకుందా? అసలు ఆమె ఎందుకు ప్రెసిడెంట్ అయ్యింది అనేది మిగతా కథ.
క్యూబికల్స్ సీజన్ 3 (Cubicles Season 3)
క్యూబికల్స్ సిరీస్ నుంచి వచ్చిన తొలి రెండు సీజన్లు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన సీజన్ 3 కూడా అదే స్థాయిలో వీక్షకులను మెప్పించింది. సీజన్ 2 ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే మూడో భాగం మెుదలవుతుంది. సోనీ లీవ్‌లో ఈ సిరీస్‌ను చూడవచ్చు. ప్లాట్ ఏంటంటే.. టీమ్ లీడర్‌గా ఎదిగిన పియూష్‌కు ఈ కొత్త పాత్రలో ఎదురైన సవాళ్లు ఏంటి? టీమ్ సభ్యులను పియూష్ సమన్వయం చేసుకోగలిగాడా? ప్రతికూల పరిస్థితులపై విజయంపై సాధించాడా? లేదా? అన్నది కథ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ