సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్ సీన్సే కొన్నిసార్లు మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
సరైనోడు (Sarrainodu)
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ ఏమోషనల్ సీన్ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.
వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)
రామ్‌చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఇందులో చరణ్ ట్రైన్‌పై నిలబడి బీహార్ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.
అరవింద సమేత (Aravinda Sametha)
తారక్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్ చేస్తుంది. అప్పుడు తారక్ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్ పోస్టు చేశారు.
మెుగుడు (Mogudu)
కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్ సీన్ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్, గోపిచంద్, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.
అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్ చాలా మందికి రుచించలేదు. పవన్ ఏడుస్తూ డైలాగ్స్ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.
శ్రీమంతుడు (Srimanthudu)
మహేష్, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్ సీన్‌పై కొన్ని సోషల్ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.
హ్యాపీ (Happy)
అల్లు అర్జున్, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్ చేశారు.
మిర్చి (Mirchi)
ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి.