ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడ మిక్స్‌డ్ టాక్ మినహా ఓవరాల్‌గా పాటిజివ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్స్‌తో దేవర ప్రదర్శితమవుతోంది. ఎన్టీఆర్ నటన, అనిరుధ్ మ్యూజిక్, కొరటాల శివ డైలాగ్స్ అదిరిపోయాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేవర ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందోనన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ ఏర్పడింది. అయితే అందరి అంచనాలకు మించి ‘దేవర’ తొలిరోజు వసూళ్లను సాధించింది.
డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
ఎన్టీఆర్-జాన్వీకపూర్ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) అత్యధిక డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దేవర నిలిచింది. దేవర చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘RRR’ తర్వాత తారక్ కెరీర్‌లో ఇదే అత్యధికం. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’తో పాన్ స్టార్‌గా ఎదిగిన తారక్ సోలోగానూ తన సత్తా ఏంటో నిరూపించాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తెలుగులో కొత్త చరిత్ర!
దేవర చిత్రం తెలుగులో సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ‘RRR’ తర్వాత తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా దేవర నిలిచిందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవర దాదాపు రూ.83.71 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క నైజాంలోనే 19.32 కోట్ల వసూళ్లు అందుకొని ‘RRR’ తర్వాత ఆల్‌టైమ్ టాప్- 2లో నిలిచిందని పేర్కొన్నాయి. కర్ణాటకలో రూ.10.03 కోట్లు, తమిళనాడులో రూ. 2.59 కోట్లు, కేరళలో రూ.64 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 9.27 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.48.12 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి.
నాలుగో స్థానంలో ‘దేవర’
దేవర చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజున ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం నిజంగా ప్రశంసించాల్సిన విషయం. దేశంలో అత్యధిక డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో దేవర నాలుగో స్థానంలో నిలిచింది. RRR (రూ223.5 కోట్లు), బాహుబలి (214.5 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.182.6 కోట్లు) చిత్రాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.172 కోట్ల డే 1 గ్రాస్‌తో సలార్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను దేవర వెనక్కి నెట్టడం విశేషం. ఇక దసరా సెలవులు కూడా ఉండనున్న నేపథ్యంలో దేవర వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈజీగానే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేవరలో హైలేట్స్ ఇవే
దేవరలో ఎర్ర సముద్రం అనే సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు కొరటాల శివ సృష్టించారు. ఈ సినిమాలో తారక్ వన్ మ్యాన్ షో చేశారు. దేవర, వర అనే తండ్రి కొడుకుల పాత్రలో అద్వితీయమైన నటన కనబరిచాడు. మరోవైపు విలన్‌గా చేసిన సైఫ్ అలీఖాన్ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనిరుధ్ ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లో అనిరుధ్ బీజీఎం గూస్‌బంప్స్ తెప్పించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తనదైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించిన తీరు అభినందనీయం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఆడియన్స్‌కు మంచి మజాను అందించాయి. అయితే సాగదీత సన్నివేశాలు, పేలవమైన లవ్‌ట్రాక్ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
కథేంటి
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!