శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి తిరుమల కిశోర్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటులు కుష్బూ, రాధిక, ఊర్వశి వంటి వాళ్లు అందరు ఈ సినిమాలో ఉండటంతో చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇంతకీ సినిమా కథేంటి ఎలా ఉంది చూసి తెలుసుకుందాం.
ఐదుగురు అన్నదమ్ములకు చెందిన ఉమ్మడి కుటుంబంలో ఒకే ఒక అబ్బాయి చిరంజీవి(శర్వానంద్). దీంతో అందరికీ చిరు మీద ఎనలేని ప్రేమ, అబ్బాయిని చాలా గారాబంగా పెంచుతారు. అయితే చిరుకి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తుంటారు. ఎన్ని సంబంధాలు చూసినా చిరుకి నచ్చినప్పటికీ ఇంట్లో వాళ్లు ఏదో వంకలు పెట్టి పెళ్లి సంబంధాలను చెడగొడుతుంటారు. అప్పుడు చిరుకి ఆద్య(రష్మిక) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. ఈ విషయాన్ని చిరు ఇంట్లో చెప్తారు. వాళ్లకు కూడా అమ్మాయి నచ్చుతుంది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది. ఆద్య వాళ్ల అమ్మ వకుళ(ఖుష్బూ) ఒక వ్యాపారవేత్త. ఆమె ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఆమె తన జీవితంలో అనుభవించిన బాధలు కారణంగా ఆద్యకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉండదు. మరి చిరు, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను ఎలా ఒప్పించారు. చివరికి పెళ్లి జరుగుతుందా లేదా వెండితరపైన చూడాల్సిందే.
సినిమా టైటిల్‌లోనే స్టోరీ ఏంటో అర్థమవుతుంది. హీరో చుట్టూ ఉండే ఆడవాళ్లు అన్ని వంకలు పెడుతూ పెళ్లి సంబంధాలను చెడగొడుతుంటారు. దీంతో ఫ్రస్ట్రేషన్‌లో నుంచి పుట్టుకొచ్చే ఫన్‌ని తెరపై చూపించి ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు తిరుమల కిశోర్. ఆయన సినిమాల్లో ఉండే క్లీన్ కామెడీతో మొదటి భాగం మొత్తం ఫన్‌గా నడిపించేశాడు. ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే సీన్లతో కడుపుబ్బా నవ్వించాడు. అయితే రెండో భాగంలో మాత్రం కాస్త కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. మొదటి భాగంలో ఎంజాయ్ చేసినవాళ్లు సెకండాఫ్ ఇంకా ఫన్ ఉండబోతుందని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. తిరిగి చివరికి అర్థవంతమైన క్లైమాక్స్ సీన్‌తో కథను ముగించాడు.
ఈ సినిమాలో ఖుష్బూ పాత్రకు మంచి స్కోప్ లభించింది. హీరోయిన్ తల్లిగా సీరియస్ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఇక హీరో తల్లిగా నటించిన రాధిక, ఊర్వశీలు కూడా చాలా కాలం తర్వాత తెలుగు తెరపై మంచి బలమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో మగవాళ్లు అక్కడక్కడా కనిపించడం తప్ప సినిమా మొత్తం ఆడవాళ్లతో నడిపించేశాడు. హీరో ఒక్కడే అందరి ఆడవాళ్ల మద్యలో సినిమ మొత్తం కనిపిస్తాడు. ఇక బ్రహ్మానందం కూడా కాసేపు తెరపై కనిపించి నవ్విస్తాడు.
అయితే సినిమా కథ ఊహించినట్లుగానే సాగుతున్నప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. రష్మిక చాలా అందంగా కనిపించింది. ఇక ఫ్యామిలీ స్టోరీస్‌లో చక్కగా ఇమిడిపోయే శర్వానంద్‌కు మరో మంచి పాత్ర లభించింది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుంది. మొత్తానికి ఫ్యామిలీతో వెళ్లి కాసేపు నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.5/5
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!